ఐటీ శాఖా మంత్రి లోకేశ్ ప్రజా దర్బార్ తోపాటు సోషల్ మీడియాలో కూడా ప్రజా సమస్యలను పరిష్కరిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ప్రజల మెప్పు పొందాలని చూసే నాయకుడిలా కాకుండా మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు తనకు ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే నాయకుడిగా లోకేశ్ ఎందరికో ఆదర్శప్రాయంగా మారారు. సోషల్ మీడియాలో సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన అప్డేట్ లను లోకేశ్ ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో కాంట్రాక్ట్ డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్ ను లోకేేశ్ రద్దు చేయించారు. దీంతో, లోవ రాజు కుటుంబ సమేతంగా వచ్చి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపో ఔట్ సోర్సింగ్ డ్రైవర్ లోవరాజు కొద్ది రోజుల క్రితం సస్పెన్షన్ కు గురయ్యారు. ఓ ట్రాక్టర్ అడ్డు రావడం, సింగిల్ రోడ్డు కావడంతో లోవరాజు నడుపుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో ఆపాల్సి వచ్చింది. ఆ గ్యాప్ లో ప్రయాణికులకు బోర్ కొట్టకుండా లోవరాజు బస్సు దిగి రోడ్డుపై డ్యాన్స్ చేశారు. దేవర సినిమాలో దావూదీ పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో లోవరాజుకు సోషల్ మీడియాలో ప్రశంసలు…ఆర్టీసీ ఉన్నతాధికారుల చీవాట్లు ఒకేసారి దక్కాయి. విధి నిర్వహణలో ఉంటూ ఇలా డ్యాన్స్ చేసినందుకు లోవరాజును సస్పెండ్ చేశారు.
ఈ విషయం లోకేశ్ దృష్టికి రావడంతో లోవరాజు సస్పెన్షన్ ను లోకేశ్ రద్దు చేయించారు. అంతేకాదు, లోవరాజుకు అన్నివిధాలుగా అండగా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన ఉద్యోగాన్ని నిలబెట్టిన లోకేశ్ కు కృతజ్ఞతలు చెప్పేందుకు లోవరాజు కుటుంబసమేతంగా లోకేశ్ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్న లోకేశ్ …సీఎం చంద్రబాబు బాటలో పయనిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.