ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప 2` నేడు అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. పుష్ప 2 ప్రమోషన్స్ సమయంలో అల్లు అర్జున్ ఎక్కడా చిరంజీవి గురించి కానీ, మెగా ఫ్యామిలీ గురించి కానీ ప్రస్తావించకపోవడం వివాదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బన్నీపై మెగా ఫాన్స్ మరియు జనసైనికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మెగా బ్రదర్స్ అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు బన్నీ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే పుష్ప 2 విడుదలను అడ్డుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇదే తరుణంలో జనసేన ముఖ్యనేత నాగబాబు ఓ సంచల ట్వీట్ పెట్టారు. `24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో, వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరిని అలరించే సినిమాలను ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను` అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
పుష్ప 2పై తీవ్ర వ్యతిరేఖత ఏర్పడిన నేపథ్యంలో నాగబాబు ఈ ట్వీట్ చేశారు. అయితే తన ట్వీట్ లో ఎక్కడా పుష్ప 2 సినిమా పేరు కానీ, అల్లు అర్జున్ పేరు కానీ ప్రస్తావించలేదు. మరోవైపు మెగా హీరోలు సైతం పుష్ప 2 పై సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతవరకు బన్నీని విష్ చేస్తూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏర్పడిన విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంత కాలం నుంచి అల్లు బ్రాండ్ ను ప్రమోట్ చేసుకుంటూ మెగా ఫ్యామిలీకి దూరమవుతున్న బన్నీకి.. పుష్ప 2 రిలీజ్ వేళ మెగా హీరోలు గట్టి షాక్ ఇచ్చారని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.