కీలక స్థానాలకు చెందిన చిరుద్యోగుల్ని లక్ష్యంగా చేసుకొని విలువైన సమాచారాన్ని సొంతం చేసుకునే గూఢాచార కాంతలు కొందరు ఉంటారు. సినిమాల్లో చూపించే వారు.. రియల్ లైఫ్ లోనూ ఉంటారు. తాజాగా అలాంటి ట్రాప్ లో అడ్డంగా బుక్ అయి.. ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు విదేశాంగ శాఖలో పని చేసే డ్రైవర్ ఒకరు.
పాకిస్థాన్ కు చెందిన మహిళ ఒకరు పూజ.. పూనమ్ శర్మ పేరుతో అతడికి గాలం వేయటం.. అతగాడు ఆమె అందానికి.. హనీ ట్రాప్ కు పడిపోయాడు. అక్కడి వరకు అతడి వ్యక్తిగత విషయంగా చూడొచ్చు. కానీ.. ఈ భ్రాంతిలో ఉండి.. ఆమె కోరుకున్న పత్రాల్ని రహస్యంగా అందించిన వైనం ఇప్పుడు అతన్ని ముంచేసింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న డ్రైవర్ ఒకరిని పాక్ మహిళ ఒకరు ట్రాప్ చేశారు. ఆమె కోరుకున్న పత్రాల్ని సదరు డ్రైవర్ ఆమెకు ఇవ్వటం.. అందుకు ప్రతిగా డబ్బులు తీసుకోవటం చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించిన విదేశాంగ అధికారులు.. అతడ్ని పట్టుకున్నారు. ఇప్పుడు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
అతడి కారణంగా ఆమె సేకరించిన సమాచారం ఎలాంటిది? ఎంత కీలకమన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. హనీ ట్రాప్ లో చిక్కుకొని బయటకు చేరవేసిన సమాచారం ఎంత సున్నితమైనదన్న విషయంపై సమాచారం బయటకు రాలేదు. చేసేది చిన్న ఉద్యోగంగా కొందరు ఫీల్ అవుతుంటారు. కానీ.. అలాంటి వారితోనూ పనులు చేయించుకునే ఇలాంటి ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిందితుడిని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ భవన్ వద్ద అరెస్టు చేశారు. ఆయన గూఢచర్యానికి పాల్పడినట్లు గుర్తించి, దేశ ద్రోహం కేసు కింద అరెస్టు చేశారు. ఇదిలావుండగా, రాజస్థాన్ పోలీసులు ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో భాగ్చంద్ (46) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 1998లో ఢిల్లీకి వచ్చారు. 2016లో మన దేశ పౌరసత్వాన్ని పొందారు. అయితే ఆయన పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు కేసు పెట్టడం గమనార్హం.