ఏపీలో అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అణిచివేయాలని చూస్తున్న నేపథ్యంలో అమరావతి రైతులకు పలువురు ఎన్నారైలు, ఎన్నారై సంఘాలు అండగా నిలిచాయి. కొంతమంది ఎన్నారైలు రాజధాని రైతుల ఉద్యమంలో ప్రత్యక్ష్యంగా, కరోనా నేపథ్యంలో చాలామంది ఎన్నారైలు పరోక్షంగా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులకు మద్దతునిచ్చేందుకు #NRIsFORAMARAVATI’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ‘ఒక రాష్ట్రం-ఒక రాజధాని’ అన్న నినాదంతో ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు, ఉద్యమానికి తమ వంతు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘#NRIsFORAMARAVATI’కి ప్రముఖ ఎన్నారై, డాక్టర్ బాబురావు దొడ్డపనేని రూ.10 లక్షలు విరాళమిచ్చారు
స్వతహాగా రైతుకుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా ఎదిగిన బాబురావు, 40 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. అమెరికాలోనే శాశ్వతంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. స్వదేశానికి, స్వగ్రామానికి తిరిగి వచ్చే ఉద్దేశ్యం లేకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న మమకారంతో రైతులకు తన వంతు సాయం అందించారు. ‘ఒక రాష్ట్రం -ఒక రాజధాని’ అన్న నినాదానికి బాబురావు పూర్తి మద్దతు తెలిపారు. తమకు బాసటగా నిలిచిన ‘డాక్టర్ బాబురావు దొడ్డపనేని ‘కు అమరావతి రాజధాని రైతులు, పలువురు ఎన్నారైలు ధన్యవాదాలు తెలిపారు.