‘కల్కి 2898 ఏడీ’ తర్వాత టాలీవుడ్ తర్వాతి బిగ్ రిలీజ్ అంటే.. ‘డబుల్ ఇస్మార్ట్’ అనే చెప్పాలి. ఈ చిత్రం ‘పుష్ప-2’ ఖాళీ చేసిన ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ హక్కులు కూడా పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. ‘హనుమాన్’ నిర్మాతలు రూ.60 కోట్లకు రైట్స్ తీసుకున్నట్లు చెబుతున్నారు.
‘లైగర్’ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమాకు ఈ రేటు పలకడం అంటే పెద్ద విషయమే. ఈ ఉత్సాహంలో చిత్ర బృందం ‘మార్ ముంత చోడ్ చింత’ అనే పాటను రిలీజ్ చేసింది. మణిశర్మ మంచి మాస్ బీట్స్‌తో ప్రేక్షకుల్లో జోష్ నింపేలా ఈ పాటను ట్యూన్ చేశాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్.. రాహుల్ సిప్లిగంజ్ సింగింగ్ కూడా బాగానే కుదిరాయి. రామ్ ఎనర్జిటిక్ స్టెప్స్.. కావ్య థాపర్ గ్లామర్ కూడా తోడై ఈ పాటకు ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే వస్తోంది.
ఐతే ‘డబుల్ ఇస్మార్ట్’ టీం అంతా పాటకు వస్తున్న రెస్పాన్స్ పట్ల హ్యాపీగా ఉన్న టైంలో అనుకోని వివాదం ఈ పాటను చుట్టుముట్టింది. ఈ పాట మధ్యలో రెండు చోట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాపులర్ డైలాగ్‌ను వాడారు. ‘ఐతే ఏం చేద్దామంటావ్ మరి’ అనే కేసీఆర్ డైలాగ్.. మీమ్స్ ద్వారా బాగా పాపులరైన సంగతి తెలిసిందే. ఈ డైలాగ్‌ను పాటలో సందర్భానుసారంగా, సరదాగా వాడుకుంది ‘డబుల్ ఇస్మార్ట్’ టీం.
ఐతే కల్లు కాంపౌండ్‌లో నడిచే పాటలో మాజీ ముఖ్యమంత్రి డైలాగ్ వాడడం అంటే ఆయనతో పాటు తెలంగాణ సమాజాన్ని కించపరచడమే అని.. తెలంగాణ అంటే తాగుడుకు కేంద్రం అన్న ఉద్దేశంతో ఈ పాట తీశారని కొందరు తెలంగాణ వాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఓ తెలంగాణ పత్రిక కథనం కూడా ప్రచురించింది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్గాలు ఈ పాట మీద నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ వివాదం సినిమా పబ్లిసిటీకి కలిసొస్తుందో లేక సినిమాను దెబ్బ తీస్తుందో చూడాలి.