తెలంగాణ ఎన్నికల సమరంలో విజయం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రేసులో వెనుకబడ్డట్టు కనిపిస్తున్న బీజేపీ.. తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. మూడు జాబితాల్లో కలిపి 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ఇక ఎన్నికల జోరును మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. జనసేనతో పొత్తు నేపథ్యంలో మిగతా స్థానాలపై బీజేపీ ఇంకా స్పష్టతకు రాలేదని తెలిసింది. అయితే ప్రకటించిన స్థానాల్లో మాత్రం ప్రచారాన్ని హోరెత్తించేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రచార బాధ్యతలను ముఖ్యంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేయబోతున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లోనూ సమరానికి సై అంటున్నారు. ఈ నాయకులపై ఇప్పుడు అధిష్ఠానం డబుల్ భారం మోపిందనే చెప్పాలి. తమ తమ నియోజవకర్గాల్లో గెలుపు కోసం ప్రచారం చేసుకుంటూనే.. పార్టీ ఇతర అభ్యర్థుల విజయం కోసం వీళ్లు పాటు పడాల్సి ఉంటుంది.
తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ మూడు హెలికాప్టర్లు సమకూర్చుకుంది. ఇందులో బండి సంజయ్, ఈటల రాజేందర్ కు చెరొకటి కేటాయించింది. మిగతా ముఖ్య నేతల ప్రచారం కోసం ఓ హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచింది. దీంతో ఎన్నికల ప్రచారంలో సంజయ్, ఈటలకు పార్టీ ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ పోస్టులు చేస్తున్నారు. మరోవైపు సంజయ్ కూడా జోరుమీద సాగిపోతున్నారు.