ఏలూరుకు ఏమైంది? అప్పటివరకు బాగా ఉన్నోళ్లంతా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఏమైంది? ఎందుకలా జరుగుతుంది? లాంటి ప్రశ్నలకు ఎవరూ సమాధానాలు చెప్పటం లేదు. బాధితుల రక్త నమూనాల్ని సేకరించి ల్యాబ్ కు పంపారు. దాని ఫలితాలు అయితే ఇప్పటివరకు రాలేదు. దీంతో.. ఎందుకలా జరుగుతుందన్నది అర్థం కావట్లేదు. వందమందితో మొదలైన ఈ అంతుచిక్కని వ్యాధి ఇప్పుడు నాలుగు వందల వరకు చేరిందంటున్నారు. ఇప్పటివరకు 200 మంది వరకు కోలుకున్నట్లు చెబుతున్నారు.
అస్వస్థతకు గురైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే కారణాలు బయటకు రావట్లేదు. అనారోగ్యానికి గురైన వారిలో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల లోపు వారే కావటం.. పెద్ద వయస్కుల వారు లేకపోవటం గమనార్హం. అప్పటివరకు బాగానే ఉండి.. హటాత్తుగా మూర్ఛకు గురికావటం..తల తిరగటం.. నోట్లో నురగ లాంటి లక్షణాలతో వస్తున్న వారికి అసలేం జరిగిందో అర్థం కావట్లేదు. ఈ విషయంపై మరింత లోతు పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అమరావతి ఐఐఎం వైద్యులతో పాటు.. హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థకు ఏపీ అధికారులు కొన్ని నమూనాలు పంపారు. శనివారం రాత్రి మొదలైన ఈ అంతుచిక్కని ఈ వ్యాధి.. క్రమక్రమంగా మిగిలిన ప్రాంతాలకు విస్తరించటం ఆందోళనకు గురి చేస్తోంది.
దోమలతో ఈ వ్యాధి పాకుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా ఈ అనారోగ్యానికి ఆర్గానో క్లోరినో రసాయనం కారణమై ఉంటుందని భావిస్తున్నారు. రక్త నమూనాల ఫలితాలు వస్తే.. చాలా చిక్కుముడులు తొలిగే వీలుందని భావిస్తున్నారు. ఏమైనా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాల్సిన పని ఉన్నా.. ప్రయాణం పెట్టుకున్నా వాయిదా వేసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీకేర్ ఫుల్.