కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, కన్నడ నాట కాంగ్రెస్ జెండా రెపరెపలాడడానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తీవ్రంగా కృషి చేశారు. దీంతో, కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు అన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి వదిలేశామని ఇద్దరు నేతలు పైకి చెబుతున్నారు.
కానీ, మరికొద్ది గంటల్లో సీఎం అభ్యర్థి ఎవరు అన్న ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒంటరి పోరాటం చేశానని, ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని డీకే చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవంటూనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య తన పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు.
తన మద్దతుదారుల సంఖ్య ఎంతో ఇప్పుడే చెప్పలేనని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. సీఎం పదవి ఎవరికి దక్కుతుంది అన్న విషయం అధిష్టానానికి వదిలేశానని చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువమంది తననే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని సిద్ధిరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, వ్యక్తిగత ఆయనతో వ్యక్తిగత సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని సిద్ధూ అన్నారు. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని డీకే, సిద్ధూలు ఇద్దరికీ చెరో రెండున్నరేళ్లు పంచాలన్న హైకమాండ్ ప్రతిపాదనను డీకే తోసిపుచ్చినట్టుగా తెలుస్తోంది.