కేసీఆర్ కు కొత్త షాక్: మేడిగడ్డ విచారణకు కోర్టుకు రావాలంటూ నోటీసులు
కొన్నిసార్లు అంతే. కొన్ని అంశాలు ఒకసారి వెంటాడటం మొదలుపెడితే అదే పనిగా వెంటాడుతుంటాయి. విసిగిస్తుంటాయి. దగ్గర దగ్గర పదేళ్లు తెలంగాణను తిరుగులేని అధిక్యతతో ఏలిన బీఆర్ఎస్ అధినేత.. గులాబీ బాస్ కేసీఆర్ కు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారం వెంబడిస్తోంది.
2023లో అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటంతో కేసీఆర్ సర్కారు ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది. ఎన్నికల్లో ఓటమికి ఇదో కారణంగా కొందరు భావిస్తుంటారు. అప్పటి నుంచి తరచూ మేడిగడ్డ ఇష్యూలో కేసీఆర్ కు చికాకులు ఎదురవుతున్నాయి.
తాజాగా ఈ ఇష్యూకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణకు హాజరు కావాలని చెబుతూ తాజాగా భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు.. ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ జీఎం సురేశ్ కుమార్ తో సహా పలువురికి నోటీసుల్ని పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమని.. ప్రజాధనం దుర్వినియోగం అయినందున దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఒక పిటిషన్ ను దాఖలైంది.
భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి 2023 నవంబరున ఏడున భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే.. ఇది తమ పరిధిలోకి రాదంటూ జనవరి 12న సదరు పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
దీన్ని సవాలు చేస్తూ ఇటీవల రాజలింగమూర్తి భూపాలపల్లి జిల్లాకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను పరిశీలించిన జిల్లా కోర్టు సెప్టెంబరు ఐదున విచారణకు హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మేఘా సంస్థ ఎండీ క్రిష్ణారెడ్డిలతో సహా పలువురికి నోటీసులు జారీ అయ్యాయి.