ఏపీలో ఉన్నది మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళలకు అన్ని రంగాల్లో జగన్ పెద్దపీట వేశారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మహిళల రక్షణకు జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం, యాప్ తీసుకువచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ కూడా దిశ యాప్ పై ఓ భారీ కార్యక్రమం నిర్వహించి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ పోలీసు శాఖ ద్వారా నానా హంగామా చేయించారు.
అయితే, గత ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు ’ఫోర్త్ లయన్ యాప్’ను కాపీ కొట్టి చట్టబద్ధత లేని దిశ యాప్ గా మార్చారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు, దిశ చట్టం ఇంకా ఆమోదం పొందలేదని, కేంద్రం ఆమోదించగానే ఏపీలో దిశ చట్టం అమలు చేస్తామని బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారు వైసీపీ నేతలు. తాజా పార్లమెంటు సమావేశాల్లో దిశ చట్టానికి ఆమోదముద్ర వేయించాలంటూ తన ఎంపీలకు హుకుం జారీ చేశారు జగన్.
అయితే, జగన్ మెప్పు పొందాలన్న హడావిడిలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్న వైసీపీ పరువు తీసింది. దిశ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపామని, ఆ వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందంటూ పార్లమెంటులో మాధవ్ లిఖిత పూర్వక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖిత పూర్వక జవాబిచ్చారు. ఆ యాప్ పై కేంద్రానికి వచ్చిన అభ్యంతరాలు, అనుమానాలను నివృత్తి చేయాలంటూ ఏపీ సర్కార్‌కు దిశ బిల్లును తిరిగి పంపామని ఆయన చెప్పడంతో మాధవ్ తో పాటు వైసీపీ ఎంపీలు షాక్ తిన్నారు.
దిశ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపించిందని, ఆమోద ప్రక్రియలో భాగంగా సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ప్రారంభించామని ఆయన వెల్లడించారు. అయితే, దిశ బిల్లుపై ఆయా శాఖలు లేవనెత్తిన సందేహాలు, పరిశీలనలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని, అయితే, ఇప్పటిదాకా ఏపీ సర్కార్ నుంచి జవాబు రాలేదని పార్లమెంటు సాక్షిగా వెల్లడించడంతో మాధవ్‌కు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. అసలు విషయం తెలుసుకోకుండా అనవసరంగా తమ పార్టీ పరువు పార్లమెంటు సాక్షిగా పోయిందని వైసీపీ ఎంపీలు మదనపడ్డారట.