టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటిల కాంబినేషన్లో విడుదలైన ‘కార్తికేయ-2’ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘కార్తికేయ’కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్లో మరో ఆసక్తికర సస్పెన్స్ థ్రిల్లర్ గా దూసుకుపోతోంది. ఇక, అనుకున్నదానికన్నా తక్కువ థియేటర్లు, స్క్రీన్లలో విడుదలైనప్పటికీ కలెక్షన్ పరంగాను ‘కార్తికేయ-2’ మంచి వసూల్ అనే రాబడుతోంది.
అయితే, సీతారామం, బింబిసార చిత్రాలు ఆగస్టు 5న విడుదల కాగా ‘కార్తికేయ-2’ చిత్రం ఆగస్టు 13న విడుదలైంది. ఆ రెండు చిత్రాలు కూడా హిట్ టాక్ తో దూసుకుపోతుండడంతో కార్తికేయ-2 సినిమాకు థియేటర్లు తక్కువగా దొరికాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ముందుగా అనుకున్నట్లుగానే జులై 22వ తేదీన ఈ చిత్రం విడుదలై ఉంటే మరిన్ని థియేటర్లు దొరికి ఉండేవని, మరిన్ని వసూళ్లు రాబట్టి ఉండేదని టాక్ వస్తోంది.
కానీ, జూలై 22న థాంక్యూ చిత్రం విడుదల చేసేందుకు ‘కార్తికేయ-2’ చిత్రాన్ని దిల్ రాజు ఒత్తిడి చేసి మరీ ఆగస్టు 13కు వాయిదా వేయించారని, అందుకే తక్కువ థియేటర్లు దొరికాయని పుకార్లు వినిపిస్తున్నాయి. బడా నిర్మాతగా పేరున్న దిల్ రాజు చిన్న సినిమాలను తొక్కేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పుకార్లపై దిల్ రాజు స్పందించారు. టాలీవుడ్ లో మిగతా నిర్మాతల సినిమాలను తొక్కాలని ఎవరూ చూడరని దిల్ రాజు ఘాటుగా స్పందించారు.
ఒక సినిమా ఆడితే అందరం సంతోషిస్తామని, ప్రతి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటామని అన్నారు. జూలై 8న థాంక్యూ చిత్రం విడుదల చేయాలనుకున్నామని, కానీ, అనివార్య కారణాలవల్ల దానిని జులై 22 కు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. అయితే, అదే రోజున కార్తికేయ-2 చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఆ చిత్ర నిర్మాత వివేక్ తో తాను మాట్లాడానని అన్నారు.
దర్శకుడు చందూ మొండేటి, హీరో నిఖిల్ లతో తాను మాట్లాడిన తర్వాతే విడుదల తేదీ వాయిదా వేసుకునేందుకు వివేక్ అంగీకరించారని చెప్పారు. తమ పరిస్థితిని అర్థం చేసుకొని ఆ చిత్రాన్ని ఆగస్టు 13వ తేదీకి వారు ఇష్టపూర్వకంగానే మార్చుకున్నారని అన్నారు. కానీ, కొన్ని వెబ్ సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తమ వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం దిల్ రాజు కొన్ని సినిమాలను తొక్కేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వ్యూస్, హిట్స్ కోసం టాలీవుడ్ హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతలను బలిపశులుగా చేయద్దని దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిని తానని, ఇతరుల సినిమాలను పాడు చేయాలని ఎప్పుడూ కోరుకోనని దిల్ రాజు ఎమోషనల్ అయ్యారు. ఒకరి సినిమాలు మరొకరు తొక్కేయడం వంటిది ఉండదని, తప్పుడు వార్తలు రాసే వాళ్లకు చదివే వాళ్లకు ఉండాల్సిన కనీస జ్ఞానం ఇది అని ఘాటుగా స్పందించారు.