కరోనా సెకెండ్ వేవ్ అయిపోయి కర్నాటకలో థర్డ్ వేవ్ అప్పుడే మొదలైపోయిందా ? క్షేత్రస్ధాయిలో ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే అందరిలోను ఇదే టెన్షన్ పెరిగిపోతోంది. కరోనా వైరస్ మొదటి విడతలో పెద్దవాళ్ళలో మాత్రమే ఎక్కువగా ప్రభావం చూపింది. ఇపుడు జరుగుతున్న సెకెండ్ వేవ్ లో పెద్దవాళ్ళు+యువత మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది.
ఇంతవరకు బాగానే ఉన్నా కర్నాటకలో క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అప్పుడే థర్డ్ వేవ్ మొదలైపోయిందనే టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే తాజాగా రాష్ట్రం మొత్తం మీద పెద్దలు+యువతతో పాటు చిన్నపిల్లల్లో కూడా దీని ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలోని మరే రాష్ట్రంలోని లేని విధంగా పిల్లల్లో కరోనా వైరస్ ప్రభావం బాగా పెరిగిపోతోంది.
మొన్నటి మార్చి నుండి ప్రస్తుత నెలవరకు నమోదైన కేసుల్లో 9 ఏళ్ళలోపు పిల్లలే సుమారు 40 వేలమందున్నారు. ఇక 10-19 ఏళ్ళలోపు వాళ్ళైతే ఏకంగా 1.05 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. అంటే చిన్నపిల్లల్లో కరోనా వైరస్ సోకటం 145 శాతం పెరిగితే టీనేజర్లలో 160 శాతం అధిక నమోదు కనబడుతోంది.
దేశంలో తొందరలోనే థర్డ్ వేవ్ ప్రారంభం అవబోతోందని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణలు ఎప్పటి నుండో హెచ్చరికలు జారీచేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ళ హెచ్చరికలన్నీ జూలై-సెప్టెంబర్ మధ్యలో థర్డ్ వేవ్ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. అయితే శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణుల హెచ్చరికలకు భిన్నంగా చిన్నపిల్లలు, టీనేజర్లకు సంబంధించి కర్నాటకలో మార్చి నుండే మొదలైపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి మే చివరకు ఇంకెతమంది బలైపోతారో అనే టెన్షన్ పెరిగిపోతోంది.