గుడివాడలో గోవా వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో గడ్డం గ్యాంగ్ ఆధ్వర్యంలో క్యాసినో, జూదం, అసభ్యర నృత్యాలు, పేకాట నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, వాటికి సంబంధించిన వీడియోలను కూడా సాక్షాలుగా చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే గుడివాడలో పర్యటించాలనుకున్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నేతలను అడ్డుకోవడం దుమారం రేపింది.
ఈ క్రమంలోనే తన ఎన్ కన్వెక్షన్ లో క్యాసినో నిర్వహించారని నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానని నాని సవాల్ విసిరారు. దానికి ప్రతి సవాల్ గా టీడీపీ నేత బొండా ఉమ…క్యాసినో వీడియోలు పెట్టి పెట్రోల్ బాటిల్ తో సవాల్ కు సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. కొడాలి క్యాసినో వ్యవహారంప సీఎం జగన్ మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
కేసినో నిర్వహించిన కొడాలి నానిని జగన్ ఎందుకు బర్తరఫ్ చేయలేదని ధూళిపాళ్ల నిలదీశారు. ఈ ఘటనపై డీజీపీ సవాంగ్ కూడా మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ లో కేసినో నిర్వహించిన వీడియోలతో అడ్డంగా దొరికిపోయినా…నానిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. జగన్ సహకారంతోనే కేసినో జరిగిందా? అని కూడా ధూళిపాళ్ల ప్రశ్నించారు.
గుడివాడను జూద రాజధానిగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు. అసలు కేసినో నిర్వహించలేదని కొడాలి నాని అన్నారని, తాను బయటపెట్టిన వీడియో ఆధారాలకు ఆయన ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. కేసినోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా… పోలీసులు ఇంతవరకు అటువైపు చూడకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. కేసినోకు జగన్ సహకారం ఉందనేది బహిరంగ నిజమని ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.