టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు, ఐటీడీపీ ఇన్చార్జి చింతకాయల విజయ్ పై సిఐడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. సీఎం జగన్ భార్య భారతిని టార్గెట్ చేస్తూ భారతి పే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ విజయ్ పై సిఐడి అధికారులు గత ఏడాది కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసు విచారణకు నేడు విజయ్ తన లాయర్ తో సహా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే విజయ్ పై కేసు పెట్టడాన్ని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రంగా ఖండించారు. తాడేపల్లి పెద్దల ఆదేశాలతోనే విజయ్ పై కేసు పెట్టారని ఉమా మండిపడ్డారు. అయ్యన్న కుటుంబం నీతి నియమాలతో బతుకుతోందని, సెంటు భూమి కోసం అయ్యన్నపై అధికారులతో కేసు పెట్టించారని విమర్శించారు. ఉన్నత విద్యావంతుడైన విజయ్ పై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
సజ్జల డైరెక్షన్లోనే ఈ తతంగం జరుగుతోందని ఉమా ఆరోపించారు. సజ్జల మాటలు విన్న గౌతమ్ సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో అందరికీ తెలుసని ఉమా అన్నారు. దోచుకున్న డబ్బును కాపాడుకునేందుకు కొడాలి నాని, పేర్ని నాని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ కళ్ళల్లో ఆనందం కోసం బూతులు తిడుతున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఈ ఇద్దరు నానీలు హైదరాబాద్లో దాక్కున్నారని, మరోసారి టిడిపి అధికారంలోకి వస్తే వీరిద్దరూ దేశం విడిచి పారిపోతారని ఉమ ఎద్దేవా చేశారు.