ఏపీ సీఎం జగన్ పాలనలో ఖజానాపై అప్పుల బజానా ఎక్కువైందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అందినకాడికి జగన్ అప్పులు చేస్తున్నారని, ఈ అప్పుల తిప్పలు భవిష్యత్తులో ఏపీ ప్రజల మెడకు గుదిబండై కూర్చుంటాయని పలువురు ఆర్థిక నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి తోడు, ఏపీ ఆర్ధిక శాఖలో రూ.41 వేల కోట్లకు సంబంధించిన జమా ఖర్చుల్లో అవకతవకలు జరిగాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
ఏపీలోని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల పనితీరు దారుణంగా ఉందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పయ్యావుల లేఖ రాయడంతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది.జగన్ సర్కార్ రూ. 25 వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన సంగతి ఆ లెక్కల్లో చూపలేదని పయ్యావుల గుర్తు చేశారు. రూ.25 వేల కోట్లు అనేది పరిమితికి మించి చేసిన అప్పు అని పయ్యావుల జగన్ సర్కార్ గుట్టువిప్పడంతో బుగ్గన సహా వైసీపీ నేతలెవరూ నోరు మెదపలేదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ లెక్కలపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ లెక్కల్లో రూ. లక్షా 31 వేల కోట్లు కనిపించడంలేదని ఉమ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా నిధుల మళ్లిస్తోందని, లెక్కల్లో గోల్ మాల్ చేస్తోందని ఉమ దుయ్యబట్టారు. జగన్ సర్కార్ డబ్బు ఎక్కడ, ఏ విధంగా ఖర్చు చేసిందో ఎవరికీ తెలియదని విమర్శించారు.
ఇలా ఏ లెక్కల్లోకి రాకుండా మాయమైన సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ఉమ నిలదీశారు. ఆదాయం, అప్పులు, ఖర్చుల లెక్కలపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం సీఎం జగన్కు ఉందా? అని దేవినేని ఉమ సవాల్ విసిరారు. మరి, ఈ సవాల్ పై జగన్, వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.