తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్.. దేవన్ రెడ్డి త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆయన అనుచరులు కూడా ఈ దఫా ఆయన జనసేనకు జై కొట్టడం ఖాయమని చెబుతున్నారు. త్వరలోనే ఆయన హైదరాబాద్‌కు కానీ, మంగళగిరికి కానీ.. వెళ్లి.. పవన్‌ను కలుసుకుంటారని అంటున్నారు. ఈ క్రమంలో ముహూర్తం చూసుకుని జెండా కూడా కప్పుకుంటారని చెబుతున్నారు.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి తన తండ్రి , ప్రస్తుత గాజువాక ఎమ్మల్యే తిప్పల నాగిరెడ్డి వారసత్వాన్ని అందుకుని పోటీ చేయాలనిదేవన్ రెడ్డి భావించారు. ఈ క్రమంలోనే గడపగడపకు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన దూకుడుగా ఉన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడ నుంచి పవన్ పోటీ చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల అంచనాలు.. ఐప్యాక్ అంచనాల నే పథ్యంలో ఏకంగా పార్టీ ఆయనను పక్కన పెట్టేసింది.
అయితే.. దేవన్‌రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోటీ చేసి తీరుతానని చెబుతున్నారు. ఇక, ఈ క్రమంలో పార్టీ నుంచి ఆయనకు సరైన సంకేతాలు రాకపోవడంతో ఇటీవల రాజీనామా చేశారు. ఇక, ఆల్టర్నేట్గా ఆయన జనసేనను ఎంచుకున్నారని అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గాజువాక, లేదా.. భీమిలి నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే, భీమిలి నియోజకవర్గాన్ని టీడీపీ సీనియర్ నేత, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సీటును టీడీపీ వదులకు నే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కుదిరితే.. విశాఖ ఉత్తరం నుంచి దేవన్‌రెడ్డిని నిలబెట్టే ప్రయత్నాలు చేయొచ్చు. ఇక,యువ నాయకుడిగా దేవన్ రెడ్డికి మంచి పేరుంది.
దీనిని పరిశీలనలోకి తీసుకుంటే.. ఆయనకు గాజువాక మంచి సీటే అవుతుంది. అయితే.. ఆయన వేసే అడుగులు, పార్టీ తీసుకునే నిర్ణయాలు దీనిని ప్రభావితం చేయనున్నాయని చెబుతున్నారు. ఇక, ఎన్నికలకు ముందు తిప్పల నాగిరెడ్డి కూడా బయటకు వచ్చి, తన కుమారుడికి సపోర్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.