స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ కు వ్యతిరేకంగా మరోసారి డెట్రాయిట్ ఎన్నారైలు కదం తొక్కారు.
సీబీఎన్ తో పాటే తామంటూ భారీ స్థాయిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఆదివారం (సెప్టెంబర్ 24) ఫార్మింగ్టన్ హిల్స్ లో ఈ రిలే నిరాహార దీక్షను నిర్వహించారు.
ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది.
‘బాబుతో పాటే మేము’, ‘బాబు అరెస్టు అక్రమం’ అంటూ ఎన్నారైలు నినదించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అలాగే అమెరికాలోని అన్ని రాష్ట్రాల చంద్రబాబు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యారనే విషయం తెలియగానే అమెరికాలోని మిచిగాన్ స్టేట్ లో ఉన్న డెట్రాయిట్ నగరంలోని తెలుగు ఎన్నారైలు ఒక్క చోటికి చేరిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుకు మద్దతుగా అప్పుడు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
మళ్లీ ఇప్పుడు బాబుకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఈ డెట్రాయిట్ తెలుగు ఎన్నారైలు ఆరోపించారు.
రాజకీయ కుట్రతోనే కక్ష కట్టి మరీ బాబును జైల్లోకి పంపించారని ఈ ఎన్నారైలు పేర్కొన్నారు.
ఇప్పటికే బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో, అటు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.