అవును… ఈ మాటే వైసీపీలోనూ వినిపిస్తోంది. గత 2019లో తన కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్.. ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులను నియమించుకున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ..ఇలా సామాజిక సమతుల్యం పాటించారు. దీనివల్ల పార్టీకి మెరుగైన ఆదరణ లభిస్తుందని భావించారు.
ఇపుడు మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేయనున్న నేపథ్యంలో ఈ సారి ఈ సంఖ్యను పెంచుతారని కొన్ని రోజులుగా వైసీపీలో చర్చసాగుతోంది. ముఖ్యంగా కమ్మసామాజిక వర్గానికి చెందిన వారికి ఈ దఫా డిప్యూటీ సీఎం ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఎందుకంటే.. అమరావతి ప్రాజెక్టు సహా.. ఇతర విషయాల్లోను.. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ఈ సామాజిక వర్గాన్ని వైసీపీ టార్గెట్ చేస్తోంది. అయితే.. ఇది ఇతర కమ్మసామాజిక వర్గాలను కూడా పార్టీకి దూరం చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఎంత అవునన్నా.. కాదన్నా.. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. ఇదే కొనసాగాలంటే.. తాము ఈ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని.. కేవలం టీడీపీకి, చంద్రబాబుకు లేదా కొందరికి మాత్రమే వ్యతిరేకమని చెప్పుకోవడానికి వైసీపీ ప్లాన్ వేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ దఫా కమ్మసామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. కుదిరితే డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు వచ్చే మంత్రివర్గంలో ముగ్గురు డిప్యూటీలకు మాత్రమే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అయితే.. అది ఏయే సామాజిక వర్గాలకు కేటాయిస్తారు? అనేది చూడాలని చెబుతున్నారు.
కానీ, ఇప్పటి వరకు ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, బీసీ సామాజిక వర్గానికి కూడా డిప్యూటీ కేటాయించి.. ఇప్పుడు హఠాత్తుగా.. ముగ్గురినే పరిమితం చేయడం అంటే.. ఆయా సామాజిక వర్గాల్లో వ్యతిరేకత.. విమర్శలు వచ్చే అవకాశం ఉంది. సో.. దీనిని బట్టి ఐదుగురుని కొనసాగిస్తారనే మరో అంచనా కూడా ఉంది.
అయితే.. దీనిపై స్పష్టత రాకున్నా.. వైసీపీలో మాత్రం .. ఈ దఫా ముగ్గురిని మాత్రమే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా నియమిస్తారని చెబుతున్నారు. ఇక, కమ్మ వర్గానికితోడు.. ఈ దఫా బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా కేబినెట్లో మంచి ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటి వరకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి.. ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సో.. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాదికి ఈ ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు.