నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏపీ, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అనుమతించి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 225కు, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 153కు పెరుగుతుందని ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ ఆశావహులంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
“ఏపీ పునర్విభజన చట్టం”-2014 ప్రకారం కూడా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. కానీ, తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంత వరకు పెంచలేదు. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. ఏపీ, తెలంగాణలో 2031 తర్వాతే నియోజకవర్గాలను పునర్విభజిస్తామని రాజ్యసభలో కూడా ప్రకటనలిచ్చేసింది.
ఆ ప్రకటనతో నియోజకవర్గ పునర్విభజనపై ఆశలు వదులుకున్న వారికి తాజాగా సుప్రీం కోర్టు తీపి కబురు చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి…తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, జమ్మూ-కాశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేసిన రిట్ పిటిషన్‌తో పాటు ఈ రిట్ పిటిషన్‌ని ట్యాగ్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.
దీంతో, ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియకు జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియకు పీటముడిపడినట్లయింది. ఒకవేళ కాశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు చెబితే…ఏపీ, తెలంగాణలు 2031 వరకు ఆగాల్సిందే. కానీ, కశ్మీర్ లో సీట్ల పెంపు కోరుకుంటోన్న బీజేపీ…ఎలాగైనా…పెంచేందుకే ప్రయత్నిస్తోంది. అది జరిగితే ఏపీ, తెలంగాణలో కూడా పెంచక తప్పదు.