సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎల్వీ రమణ.. మరికొందరు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టుచీఫ్ జస్టిస్ కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన వైనం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే.దీని అనంతరం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేసింది. నిరాధారమైన ఆరోపణల్ని గుప్పిస్తూ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయటం న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవటమేనని పేర్కొంది.
సీఎం జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా అభిప్రాయపడింది. ఎల్వీ రమణ నీతి..నిజాయితీ కలిగిన ఉత్తమ న్యాయమూర్తిిగా పేర్కొనటమే కాదు.. ఆయనపై చేసిన ఆరోపణల్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లుగా ఏకగ్రీవ తీర్మానం చేస్తూ లేఖను విడుదల చేశారు.
‘‘జస్టిస్ రమణ.. హైకోర్టు న్యాయమూర్తులపై వాస్తవరహిత ఆరోపణల్ని చేశారు. లేఖను ప్రచారంలోకి తీసుకొచ్చి న్యాయ పాలన వ్యవస్థలో జోక్యం చేసుకోవటానికి ప్రయత్నించారు. ఇది స్వతంత్ర న్యాయవ్యవస్థను భయపెట్టేందుకుచేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీసేందుకు బరితెగించి చేసిన ఈ ప్రయత్నాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది.
వీరితో పాటు.. సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ కూడా ఖండిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఇలా జస్టిస్ రమణపై చేసిన ఆరోపణలపై కీలకమైన ఢిల్లీ హైకోర్టు.. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘాల లేఖలు ఇప్పుడు సంచలనంగా మారాయి.