కరోనా ప్రభావంతో ఇప్పటి వరకు భారత్ నుంచి రాకపోకలు సాగించేందుకు ప్రపంచ దేశాలు నిషేధం విధిం చాయి. ఈ విషయంలో ఆ దేశం, ఈ దేశం అనే మాట లేకుండా అన్ని దేశాలూ.. ఒకే నిర్ణయం ప్రకటించా యి. విమానాలు నిషేధించాయి. వీసాలపై ఆంక్షలు కూడా విధించాయి. దీనిపైనే ప్రస్తుతం భారత్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఇప్పుడు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏర్పడింది.
రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకుంటున్నాయి. తొలిగా.. ఢిల్లీ ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను నగరంలోకి అను మతించేది లేదని.. వారు 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని.. ఆ తర్వాతే నగరంలోకి అనుమతిస్తామని.. దీనిని ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వేరియంట్ విజృంభిస్తోందన్న అనుమానం ఉందని.. పేర్కొంది. ఎన్ 440కేగా పేర్కొంటున్న ఈ వేరియంట్‌పై ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. పరిశోధనలు ప్రారంభించాయి. కర్నూలు, హైదరాబాద్‌లో కొందరు కరోనా బాధితుల నుంచి తీసుకున్న నమూనాలను సీసీఎంబీకి పంపించాయి.
అయితే.. ఈ ఫలితాలు ఇంకారాకముందుగానే ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణాలను నిషేధించే విషయాన్ని త్వరలోనే చెబుతామని పేర్కొనడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా విషయంలో ఏకాకి అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.