- వచ్చే 3 నెలల్లో మరో 30,900 కోట్లు
- అంటే ఏడాదిలోనే 1,11,500 కోట్ల కొత్త అప్పు
- తెస్తున్న రుణాలు ఎటుపోతున్నాయి?
- వస్తున్న ఆదాయం ఏమవుతోంది?
- ఇప్పటికే తలకు 70వేలు చొప్పున భారం
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికే గుండెలదాకా కూరుకుపోగా కొత్త ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి తల కూడా ఊబిలోకి పోయి అంతరించే ప్రమాదం కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం రుణావేశంతో దూసుకెళ్తుండడమే దీనికి కారణం.
నవ్యాంధ్రలో కనిపించని అభివృద్ధి అప్పుల్లో మాత్రం కనిపిస్తోంది. ఆదాయం తగ్గితే అనవసర ఖర్చులు తగ్గించుకోవాలన్న మౌలిక ఆర్థిక సూత్రాన్ని పక్కన పెట్టిన జగన్ ప్రభుత్వం.. అప్పులు పుట్టించేందుకు నానా తంటాలు పడుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ.80,000 కోట్లు రుణం తెచ్చి రికార్డు సృష్టించింది. 2020-21లో తన రికార్డు తానే బ్రేక్ చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం కేవలం తొమ్మిది నెలల్లోనే రూ.80,600 కోట్ల అప్పులు తెచ్చింది. మరో మూడునెలల్లో రూ.30,900 కోట్ల రుణాలకు సన్నద్ధమవుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రుణాలు రూ.1,11,500 కోట్లకు చేరతాయని అంచనా. మార్చి 15 నాటికి ఖజానాకు వచ్చే ఆదాయం కాకుండా అదనంగా 30 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు ప్రణాళికలు వేసింది.
అప్పు ఎక్కడ, ఎలా, ఏ రూపంలో దొరికినా రెండోమాట లేకుండా తీసేసుకుంటోంది. అవి తీర్చకుండానే మళ్లీ దూసితేవడానికి తయారవుతతోంది. దీంతో రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అప్పుల సంక్షోభంలో కూరుకుపోతోంది. ‘ఆదాయం పెంచుకుని సంక్షేమం’ కాకుండా… ‘అప్పులు తెచ్చి సంక్షేమం’ అనే సూత్రాన్ని జగన్ ప్రభుత్వం ఎంచుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర వాటా రుణభారం రూ.97 వేల కోట్లు కాగా.. జగన్ గద్దెనెక్కిన తొలి ఏడాదిలోనే ఏకంగా 80 వేల కోట్లు అప్పు చేసింది. అంటే రాష్ట్రావిర్భావం నుంచి ఐదు దశాబ్దాల్లో చేసిన అప్పును ఒక్క ఏడాదిలోనే చేసేశారన్న మాట! 2020 నవంబరు నాటికి ఏపీ స్థూల అప్పు రూ.3,73,140 కోట్లకు చేరుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికలో పేర్కొంది. డిసెంబరు నెలదీ కలిపితే… ఇది 3.83 లక్షల కోట్లకు చేరుతుంది. ఈ మొత్తం అప్పును రాష్ట్రంలోని 5.39 కోట్ల మందికి విభజిస్తే ఒక్కొక్కరిపై రూ.70,000 వరకు భారం పడుతుందన్న మాట.
కేంద్రమే బాటలు వేస్తోంది..
రాష్ట్రాలను రుణాల ఊబిలో పడేసేందుకు కేంద్రమే దారిచూపుతోంది. కరోనా పేరు చెప్పి కొంత, సంస్కరణల సాకుతో ఇంకొంత రుణం తెచ్చుకునేందుకు అనుమతి ఇస్తోంది. 2020-21లో బహిరంగ మార్కెట్ నుంచి నవ్యాంధ్ర రూ.47,000 కోట్ల వరకు అప్పు సమీకరించవచ్చు. తొలి తొమ్మిది నెలల్లో రూ.36,000 కోట్లకు కేంద్రం అనుమతించింది. మిగిలిన రూ.11,000 కోట్ల పరిమితిని చివరి త్రైమాసికంలో వాడుకునేందుకు అనుమతి ఇంకా ఇవ్వలేదు.
కరోనా లాక్డౌన్ కారణంగా కేంద్రం మార్కెట్ నుంచి రూ.20,000 కోట్లు సమీకరించేందుకు రాష్ట్రాలకు నాలుగు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇందులో ఏపీ రూ.17,500 కోట్లను వాడుకుంది. మున్సిపాలిటీల్లో సంస్కరణల ద్వారా మరో రూ.2,500 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్బీఐతో సంబంధం లేకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ పేరుతో వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.23,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అవకాశం ఉంది.
ఇందులో రూ.14,700 కోట్లు అప్పు తెచ్చారు. ఇంకా ఈ పరిమితి కింద రూ.8,300 కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవడం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రూ.21,500 కోట్లు అప్పు తెచ్చుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇందులో ఇప్పటి వరకు రూ.12,400 కోట్లు తెచ్చారు. ఇంకా రూ.9,100 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రతి నెలా ఆర్థిక శాఖ అప్పులు, వాటిపై వడ్డీ చెల్లింపుల కోసం రూ.2,600 కోట్లు నుంచి 2,800 కోట్లు వరకు చెల్లిస్తోంది. అంటే… ఏడాదికి దాదాపు రూ.32,000 కోట్లు చెల్లిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అప్పులు – వడ్డీ చెల్లింపుల భారం ఏడాదికి రూ.35,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారుల అంచనా.
ఇదంతా ఏం చేస్తున్నారు..?
రాజధాని అమరావతిని అటకెక్కించారు. రాష్ట్రంలో ఎక్కడా కొత్తగా రోడ్లు వేయడంలేదు. గతుకుల రోడ్లే గతి! పోలవరం ప్రాజెక్టు పనులూ పెద్దగా నడవడం లేదు. రాష్ట్రానికి ఆస్తులు సమకూర్చే ‘క్యాపిటల్ ఎక్స్పెండించర్’ (మూలధన వ్యయం) పెద్దగా కనిపించడంలేదు. మరి… అప్పు చేసి తెస్తున్న వేల కోట్లు ఏం చేస్తున్నారు? ఆ సొమ్ములు ఎటు పోతున్నాయి? ఈ ప్రశ్నకు ప్రభుత్వం చెబుతున్న ఏకైక సమాధానం… ‘సంక్షేమం’.
ఈ లెక్కన ప్రతినెలా రూ.8,955 కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందన్న మాట! నిజానికి గత 20 నెలల్లో ప్రజలపై నెలకు రూ.4వేల కోట్ల పన్నుల భారం వేశారు. కేంద్రసాయం అదనంగా రూ.7,700 కోట్లు అందింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రెవెన్యూ వసూళ్లు ఆరుశాతం పెరిగాయి. మరి ఈ డబ్బంతా ఏమైంది? ఎక్కడికి పోయింది? ప్రచార ఆర్బాటం తప్ప ప్రజలకు చేసింది శూన్యం.
అప్పులు, పన్నుల భారం ప్రజలకు, పప్పుబెల్లాలు వైసీపీ నేతలకు అన్నట్లుగా రాష్ట్రంలో వ్యవహారం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధికి పైసా ఇవ్వకపోయినా.. గతం కంటే ఖర్చులు 23శాతం పెరిగాయి. అనుకూల కాంట్రాక్టర్లకు పనులుచేసినా చేయకున్నా ప్రభుత్వం వేల కోట్లు ఉదారంగా ఇచ్చేస్తోంది.
కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం టీఏ, డీఏలు లేవు. ఆరు డీఏలు బకాయిపెట్టారు. చివరకు విశా రంత ఉద్యోగులకు ఒకటో తేదీన పింఛను వచ్చి ఏడాదిన్నర దాటింది. 2019 జూలై తర్వాత ఇప్పటివరకు ఉద్యోగులకు కూడా ఒకటో తేదీన వేతనాలు అందడం లేదు. కరోనా పేరు చెప్పి నిరుడు మార్చి, ఏప్రిల్ నెలల్లో సగం జీతం కోశారు.
ఆ బకాయులకు ఇంతవరకు దిక్కులేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి పనీ అప్పులతోనే నడుస్తోంది. ఉచిత పథకాల కోసం.. .ఒక్క నవంబరు నెలలోనే రూ.13,000 కోట్ల అప్పులు చేశారు. ప్రస్తుతం అప్పు చేస్తే తప్ప ఒక్కపనీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ తయారీపై శ్రద్ధ పెట్టాలని, అంచనాలు సరిగ్గా రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖకు కాగ్ అక్షింతలు వేసింది. అంచనాలకు, వాస్తవాలకు వేల కోట్ల రూపాయల తేడా ఉంటోందని అభిప్రాయపడింది.
రాష్ట్ర విభజన నాటికి రుణ భారం 97వేల కోట్లు
వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పు (2019 మార్చినాటికి): 2.59 లక్షల కోట్లు
చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో చేసిన అప్పు: 1,62,000 కోట్లు
చంద్రబాబు సగటున ఒక్క ఏడాదిలో చేసిన అప్పు: 32,400 కోట్లు
జగన్ వచ్చాక తొలి ఆర్థిక సంవత్సరం చేసిన అప్పు: 80,000 కోట్లు
2020-21లో తొలి తొమ్మిది నెలల్లో తెచ్చిన రుణం: 80,600 కోట్లు
2020 డిసెంబరు నాటికి రాష్ట్ర స్థూల రుణభారం: 3.83 లక్షల కోట్లు
2020 నవంబరు చివరి నాటికి రెవెన్యూ లోటు: రూ.57,925 కోట్లు
(దీనిని రూ.1400 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్లో చెప్పారు)