బతుకు చిత్రం మారుతోందా? అంటే.. అవునని చెబుతోంది తాజాగా విడుదలైన అధ్యయన రిపోర్టు. గతంలో మాదిరి పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వటం తగ్గించేసి.. అప్పులు చేసే కొత్త తరహా జీవనం ఎక్కువైందన్న విషయాన్ని తాజాగా వెల్లడైన రిపోర్టు షాకిచ్చేలా మారింది. గడిచిన యాభై ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో పొదుపు తగ్గిపోగా.. ఖర్చులు పెరిగి.. వాటి కోసం అప్పులు చేయటం పెరిగినట్లుగా పేర్కొంది. ఇది వ్యక్తుల వరకే కాదు.. చిన్న సంస్థలు కూడా ఇలాంటి తీరులోనే ఉన్నట్లుగా వెల్లడైంది.
దేశంలోని వ్యక్తులు.. చిన్నస్థాయి కుటుంబ సంస్థల ఆర్థిక పరిస్థితులపై ఎస్ బీఐ జరిపిన అధ్యయనంలో వెలుగు చూసిన అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా ఉన్నాయి. కరోనా తర్వాత పొదుపు తగ్గిపోయి.. అప్పులు పెరిగినట్లుగా తేల్చింది. నికర ఆర్థిక పొదుపు రేటు 2022 ఏప్రిల్ – 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లుగా గుర్తించింది. దీంతో.. స్థూల దేశీయోత్పత్తి 5.15 శాతం పడిపోయినట్లుగా పేర్కొన్నారు.
అయితే.. ప్రజలు, సంస్థలు చేస్తున్న అప్పులు దేని కోసం అన్న విషయాన్ని చూస్తే.. అవన్నీ ఇతరభౌతిక పొదుపు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నట్లుగా గుర్తించారు. ఈ కారణంగా మరింతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇంతకూ రిపోర్టు ఏం చెప్పిందన్నది చూస్తే.. పెరిగిన హౌస్ హోల్డ్ సెక్టార్ రుణం రూ.8.2 లక్షల కోట్లలో బ్యాంక్ రుణాలు రూ.7.1 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 55 శాతం ఇళ్లు.. విద్య.. వాహనాల కొనుగోళ్లకు వెచ్చించారు.
– ఇళ్ల రుణాల విషయానికి వస్తే 2020 మార్చిలో 40.7 శాతం ఉంటే.. 2023 జూన్ లో 36.5 శాతానికి తగ్గింది.
– పొదుపు నుంచి తగ్గిన మొత్తంలో ప్రధాన భాగం భౌతిక ఆస్తుల వైపునకు మళ్లింది. దీనికి తక్కువ వడ్డీ వ్యవస్థే కారణం.
– ఈ రిపోర్టును చూస్తే రియాల్టీ రంగం పురోగతిలో ఉందన్న విషయం అర్థమవుతుంది.