ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలతో పాటు.. ఘాటైన హెచ్చరికలతో అందరి చూపు తన మీద పడేలా చేస్తున్నాడు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ. ఇప్పటికే ఇతను పలుమార్లు భారతదేశానికి హెచ్చరికలు జారీ చేయటం తెలిసిందే. బ్రిటన్ లో తలదాచుకుంటున్న ఇతడు.. తాజాగా మరోసారి తన మాటలతో రెచ్చిపోయాడు. ఈ నెల 22 (సోమవారం) అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో విధ్వంసం ఖాయమంటూ వార్నింగ్ లు ఇవ్వటం తెలిసిందే.
దీంతో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యతో పాటు చుట్టుపక్కల జల్లెడ పడుతున్నాయి. అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరుల్ని శుక్రవారం యూపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి తన నోటికి పని చెప్పాడు పన్నూ. ఖలిస్థానీ ఉగ్రవాదిగా.. సిక్స్ ఫర్ జస్టిస్ అధినేతగా గుర్తింపు పొందిన ఈ తీవ్రవాది.. హింసతో దేశాన్ని అతలాకుతలం చేస్తానంటూ మాటలు జారటం తెలిసిందే.
యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసిన ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరుల్ని వేధింపులకు గురి చేయొద్దన్నాడు. బ్రిటన్ నుంచి ఒక నెంబరు నుంచి వచ్చిన రికార్డింగ్ మెసేజ్ లో అతగాడు తన మాట్లాడుతూ.. భారత్ కు హెచ్చరికలు జారీ చేశాడు. భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్న విధ్వంసకారుల్ని వేధించొద్దని చెబుతూనే.. అయోధ్యలోని రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసాన్ని స్రష్టిస్తామని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను హత్య చేస్తామని ప్రకటించాడు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఖలిస్థానీలతో సంబంధాలు ఉన్నాయని అరెస్టు చేసిన ముగ్గురిలో ఒకడు.. రాజస్థాన్ కు చెందిన సీకర్ వాసి ధరమ్ వీర్ గా గుర్తించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను రిపబ్లిక్ డే వేళ హత్య చేస్తానని ఇటీవల వీడియో సందేశంలో బెదిరింపులకు దిగటం తెలిసిందే. తాజాగా అందిన హెచ్చరికలతో నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తాజా వార్నింగ్ నేపథ్యంలో పన్నూ వ్యవహారాన్ని మరింత సీరియస్ గా తీసుకొని అతడి లెక్క తేల్చాల్సిన టైం వచ్చేసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.