షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ ఇంట్లో ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఒక అనుమానాస్పద డెడ్ బాడీ లభ్యమైంది. మరణించిన వ్యక్తి కేంద్ర మంత్రి కుమారుడికి మంచి మిత్రుడిగా చెబుతున్నారు. ఆ యువకుడి పేరు వినయ్ శ్రీవాస్తవ. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో చోటు చేసుకున్న ఈ ఉదంతం రాజకీయంగా ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మరణించిన యువకుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. చివరకు కేంద్ర మంత్రి ఇంట్లో సదరు యువకుడు నిర్జీవంగా ఉన్నట్లు గుర్తించారు.
ఘటనాస్థలానికి భారీ ఎత్తున పోలీసు బలగాలు చోటు చేసుకున్నాయి. ప్రాథమిక విచారణలో భాగంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఒక పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పిస్టల్ తన కుమారుడిదేనని కేంద్ర మంత్రి వెల్లడించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. జాతీయ చానళ్ల కథనాల ఆధారంగా చూస్తే.. యువకుడ్ని కేంద్ర మంత్రి తనయుడే కాల్చి చంపినట్లుగా పేర్కొంటున్నారు. అయితే.. ఈ ఉదంతంపై కేంద్ర మంత్రి వాదన మరోలా ఉంది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్ తన కొడుకుదే అని చెప్పిన ఆయన.. ‘‘ఈ ఘటన మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్య జరిగినప్పుడు నా కొడుకు ఇంట్లో లేడు. అతడి స్నేహితులే ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులు ఎవరైనా సరే వదిలి పెట్టకూడదు. ఈ ఘటన గురించి తెలిసిన వికాస్ చాలా బాధ పడుతున్నాడు. మరణించిన యువకుడు అతనికి మంచి స్నేహితుడు’’ అని వ్యాఖ్యానించారు. కొడుకు ఇంట్లో లేని వేళ.. అతని గన్ ను ఎవరు తీసుకునే సాహసం చేస్తారు? ఆయుధాన్ని ఎంతో జాగ్రత్తగా ఉంచుతారు. అలాంటిది అందరికి అందుబాటులో ఉంచారా? లేదంటే కేంద్ర మంత్రి కొడుకే కాల్చి చంపాడా? అయితే.. ఎందుకు చంపాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.