గత ఏడాదిన్నర కాలంగా వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణమైన స్థితికి చేరుకున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాలనలో ఇటు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు కొందరు సామాన్యులపై కూడా దాడులు పెరిగాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దోపిడిదారులు, గుండాలు, మాఫియా శక్తులు ఏపీని ఆటవిక రాజ్యంగా మార్చాయని, ఏపీలో బడుగుబలహీన వర్గాల వారిపై గంపగుత్త దాడులు, చట్ట ఉల్లంఘనల, ప్రాథమిక హక్కులను కాల రాయడం వంటివి నిత్యకృత్యమయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయాలపై స్పందించాలంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు చంద్రబాబు పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సవాంగ్ కు చంద్రబాబు మరో లేఖ రాశారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న 600 మందికి పైగా టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సవాంగ్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణం అని సవాంగ్ కు రాసిన లేఖలో చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేయడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై అణచివేత విచ్చలవిడిగా సాగుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాథమిక హక్కులు అణిచివేతపై కొందరు పోలీసులు శ్రద్ధ చూపుతున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పార్టీతో కుమ్మక్కవటం బాధాకరమని చంద్రబాబు విమర్శించారు. అసమ్మతి ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం అని, టీడీపీ నేతలకు జారీ చేసిన నోటీసులు ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదని నోటీసుల్లో పేర్కొన్నారని, అసమ్మతిని అణిచివేసే బదులు శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు దృష్టి పెట్టాలని చంద్రబాబు హితవు పలికారు.
కాగా, పలు పిటిషన్లు, కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తీరుపై గతంలోనే ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైనం చర్చనీయాంశమైంది. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని, ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేని పక్షంలో డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలంటూ హైకోర్టు గతంలో షాకింగ్ కామెంట్లు చేసింది.