విశాఖలో పేరు మోసిన రౌడీ షీటర్ ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి వేళలో రోడ్డు మీద తెలిసిన వారితో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న వేళ.. వారి ముందు ఒక కారు ఆగింది. అందులో నుంచి కిందకు దిగిన ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఎటాక్ చేయటంతో సదరు రౌడీ షీటర్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో.. విశాఖలో సంచలనంగా మారింది.
విశాఖలో పేరు మోసిన మద్దిల పాలెం సమీపంలో చోటు చేసుకున్న ఈ మర్డర్ వివరాల్లోకి వెళితే.. విశాఖలోని కేఆర్ఎం కాలనీకి చెందిన 32 ఏళ్ల వెంకటరెడ్డి అలియాస్ బండ్రెడ్డి కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
అతడిపై ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ కూడా ఉంది.
ఇదిలా ఉంటే.. వెంకటరెడ్డి ఇంటికి తరచూ కుర్రాళ్లు కొందరు వచ్చి.. నిన్ను త్వరలో లేపేస్తామని చెబితే.. వారి మాటల్ని లైట్ తీసుకున్నాడు. వారి వయసు తక్కువగా ఉండటంతో వారి మాటల్ని సీరియస్ గా తీసుకోలేదు.దీనికి తోడు తనకు వార్నింగ్ ఇచ్చిన వారికి తనకు గొడవ లేకపోవటంతో వారు చేసే వార్నింగ్ లను లైట్ గా తీసుకున్నాడు. మంగళవారం రాత్రి పుట్ పాత్ మీద పిచ్చాపాటిగా మాట్లాడుతున్న వేళ.. హటాత్తుగా కారులోనుంచి దిగిన వారు ఇనుప రాడ్లు పట్టుకొని దారుణంగా దాడి చేశారు.
ఈ దాడిలో వెంకట్రామిరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోవటం.. మరణించటం జరిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నంతనే పోలీసులు అలెర్టు అయి.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.