ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తికి కన్న కూతురే శత్రువుగా మారారా? రాజకీయంగా శత్రువుల కన్నా కూడా కన్న కూతురుని ఎదుర్కోవడం ఆయనకు ఇబ్బందిగా మారిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. బలరాం కుమార్తె కరణం అంబికా కృష్ణ తన తండ్రికి వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారు. గతంలో కరణం విజయం సాధించిన తర్వాత.. ఆయనపై కుమార్తె అంబికా కృష్ణ హైకోర్టులో కేసు వేశారు.
సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనను తన తండ్రి రెండో వివాహం చేసుకున్నారని.. దీనిని ఆయన ఎన్నికల అఫిడవిట్లో దాచిపెట్టారని.. ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.
ఇటీవల స్థానిక ఎన్నికలలో కరణం వర్గానికి వ్యతిరేకంగా అంబికా కృష్ణ రంగంలోకి దిగి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె టీడీపీ నాయకురాలిగా ప్రచారం చేసుకుంటున్నారు. అదేసమయంలో కరణం.. వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో “అరాచకాలకు, అన్యాయాలకు వ్యతిరే కంగా ఓటు వేయండి“ అంటూ.. తన తండ్రినే ఆమె టార్గెట్ చేయడం గమనార్హం.
మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కరణం వర్గం పోటీ చేస్తున్న చోట.. అంబికా కృష్ణ ఇలా యాంటీ ప్రచారం చేస్తున్నారు. అది కూడా కేవలం తన తండ్రి మద్దతుతో రంగంలోకి దిగిన వారు పోటీచేస్తున్న వార్డుల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ వంటివారి ఫొటోలు ముద్రించిన పోస్టర్‌పై..“అరాచకాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడదాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. చంద్రన్న ఆశయాలను గెలిపించుకుందాం. చీరాల గడ్డపై టీడీపీ జెండా ఎగరేద్దాం“ అనే స్లోగన్లతో ఈ ప్రచారం సాగుతుండడం గమనార్హం.
వాస్తవానికి కరణం .. తన రాజకీయ శత్రువులకు చెక్ పెడుతున్నారు. కానీ, తన కుమార్తే ఇలా యాంటీ ప్రచారం చేస్తుండడం.. టీడీపీ నుంచి కూడా ఎలాంటి నియంత్రణ చేయకపోవడంతో ఆయన ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని కరణం వర్గం తర్జన భర్జన పడుతుండగా.. మరోవైపు.. చీరాలలో అంబికా కృష్ణ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఏం జరుగుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.