గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభి తోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతావారిని స్టేన్ కు తరలించిన పోలీసులు….పట్టాభిని మాత్రం ఏ స్టేషన్ కు తరలించారో వెల్లడించలేదు. పట్టాభి ఆచూకీ తెలియకపోవడంతో ఆయన భార్య చందన, టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాభిని ఏదో ఒక చోటికి తరలించి కొట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం పట్టాభిని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఆ తర్వాత పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. అయితే, కోర్టుకు వెళ్లే ముందు పట్టాభి కమిలిపోయిన తన అరచేతులను చూపించారు. దీంతో, అందరి అనుమానాలు నిజమయ్యాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను కస్టడీలో అరికాళ్ళపై కొట్టిన విధంగానే పట్టాభిని కూడా అరచేతులపై కొట్టినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.
తాడేపల్లి పెద్దల ఆదేశాల ప్రకారమే పట్టాభిని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పట్టాభిని కస్టడీలో హింసించారని ఆయన సతీమణి చందన సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకొని వచ్చి కొట్టినట్టుగా ఆరోపిస్తున్నారు.
పోలీసులందరినీ బయటకు పంపి ఈ దాడి చేశారని ఆమె ఆరోపించారుజ సేఫ్ గా తీసుకొస్తామని చెప్పి జీప్ ఎక్కించుకుపోయిన పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని ఆరోపించారు. తన భర్తను రిమాండ్ కి తరలిస్తామని చెప్తున్నారని, రిమాండ్ కు తరలించాక ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. తన భర్తకు ఏదైనా జరిగితే డీజీపీ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని చందన వార్నింగ్ ఇచ్చారు. మీడియా ముందు మాట్లాడిన చందన తన భర్త దుస్థితి తలచుకొని కన్నీటిపర్యంతమయ్యారు.