టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఏమాత్రం సందు దొరికినా పాదయాత్రను భగ్నం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల బంగారుపాళ్యంలో లోకేష్ కాన్వాయ్ లోని రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
అయితే, పోలీసులు వాహనాలను సీజ్ చేయడంతో ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కి లోకేష్ ప్రసంగించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జీడీ నెల్లూరు నియోజకవర్గం సంచిరెడ్డిపల్లిలో మరోసారి లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం షాకింగ్ గా మారింది. స్టూల్ పైకి ఎక్కి లోకేష్ ప్రసంగిస్తుండగా ఆ స్టూల్ లాగేసేందుకు పోలీసులు ప్రయత్నించడం వివాదానికి దారితీసింది. బాషా అనే కార్యకర్త నుంచి మైక్ కూడా పోలీసులు లాక్కోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ క్రమంలోనే పోలీసులపై లోకేష్ తో పాటు టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలోనే భారత రాజ్యాంగాన్ని చూపిస్తూ రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ పోలీసులపై లోకేష్ ఫైర్ అయ్యారు. మరోవైపు, లోకేష్ పై మరొక క్రిమినల్ కేసును పోలీసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా నర్సింగరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
అనుమతి లేకుండా సమావేశాన్ని నిర్వహించి, నిబంధనలు, ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, లోకేష్ ఇతర టిడిపి నేతలపై పోలీసు అధికారులే ఫిర్యాదు చేసి వారే కేసు నమోదు చేయడం విశేషం. ఇక, పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత లోకేష్ పై కేసు నమోదు కావడం ఇది ఐదోసారి.