సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ రోజు చనిపోయిన సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు దానం చేశారు. సీతారాం ఏచూరి మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
1952 ఆగస్టు 12న చెన్నైలో సీతారాం జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కల్పకం, సర్వేశ్వర సోమయాజులు కాకినాడకు చెందినవారు. చెన్నైలో పుట్టిన సీతారాం ఏచూరి హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేసి ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదివారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఢిల్లీ వేదికగా చురుగ్గా పాల్గొన్నారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో చేరారు. ఆ మరుసటి ఏడాది సీపీఐ (మార్క్సిస్ట్) పార్టీలో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆయన జేఎన్ యూ విద్యార్థిగా ఉన్న సీతారాం ఏచూరి అరెస్ట్ అయ్యారు.
సీతారాం ఏచూరి రెండు వివాహాలు చేసుకున్నారు. ప్రముఖ విద్యావేత్త, వామపక్ష కార్యకర్త, స్త్రీవాద ఉద్యమకారిణి వీణా మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్ ఆయన మొదటి భార్య. ప్రముఖ మహిళా జర్నలిస్టు సీమా చిస్తీని సీతారాం ఏచూరి రెండో వివాహం చేసుకున్నారు. సీతారాం ఏచూరికి ముగ్గురు పిల్లలు.
సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.ఈ విషాద సమయంలో ఏచూరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అట్టడుగు వర్గాల ప్రజలతో సీతారాం ఏచూరికి మంచి అనుబంధం ఉందని, భారతదేశ రాజకీయాల్లో ఆయన అత్యంత గౌరవనీయ వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
సీతారాం ఏచూరి మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ఏచూరి మరణంతో ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. ఏచూరికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని లోకేశ్ అన్నారు.