మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి బ్రోకర్ అని, చిల్లర బేరగాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడని, అటువంటి చిరంజీవిని భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదిక మీదకు పిలవడంపై నారాయణ మండిపడ్డారు.
అల్లూరి గురించి అందరికీ చాటిచెప్పిన సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని, అటువంటి నటుడిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకుండా చిరంజీవి వంటి చిల్లర గాళ్లను పిలిచి బీజేపీ పరువు పోగొట్టుకుందని షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ నూ నారాయణ వదలలేదు. పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ వంటివాడని, అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని సెటైర్లు వేశారు. పవన్ రాజకీయ అస్పష్టత వీడాలని, వైసీపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని అన్నారు.
ఇక, బీజేపీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైసీపీ మద్దతివ్వడంపై నారాయణ మండిపడ్డారు. బీజేపీ పెద్దలకు జగన్, వైసీపీ నేతలు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలకు ఇంకా హైదరాబాదే రాజధాని అని, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ హైదరాబాద్ నుంచే విజయవాడ వస్తున్నారని ఆరోపించారు. ఏపీకి రాజధాని ఉండాలని, దానిని అభివృద్ధి చేయాలన్న ఆలోచన జగన్ కు లేదని విమర్శించారు. ఏపీలో రోడ్ల దుస్థితి పై జనసేన చేస్తున్న ఆందోళనకు నారాయణ మద్దతిచ్చారు.
వరదల భీభత్సాన్ని అంచనా వేయడంలో, వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. స్వతంత్రంగా ఉండే వెంకయ్య నాయుడు నోరు నొక్కిన ఎన్డీఏ కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.