రాష్ట్ర జీవనాడి… ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజల అమృతధార అయిన పోలవరం ప్రాజెక్టును చంపేస్తున్న ఏపీ సర్కారు తీరుపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైన విషయం తెలిసిందే. కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే పోరాడటం మానేసి ఇచ్చిన డబ్బులకు తగ్గట్టు పనిచేసి ప్రాజెక్టు కట్టాం అంటే కట్టామన్నట్టు ప్లాన్ చేసినట్టు సమాచారం బయటకు పొక్కింది. దీంతో ప్రజలు జగన్ తీరుపై మండిపడ్డారు. మోడీ అంటే మీకు ఎందుకు అంత భయం జగన్ గారు అని అడుగుతున్నారు.
సుప్రీంకోర్టు కు రంగులకోసం, రమణ కూతుర్ల కోసం, నిమ్మగడ్డ కోసం వెళ్లిన మీరు పోలవరం కోసం వెళ్లలేరా జగన్ గారు అని జనం నిలదీస్తున్నారు. ఎవరైనా పోలవరం గురించి, అమరావతి గురించి అడుగుతారేమో అని జగన్ జనాన్ని కలవడానికే ఇష్టపడటం లేదు. ప్రజలకు పూర్తి దూరంగా ఉండిపోయారు. సుమారు రెండేళ్లు కావస్తున్నా సీఎం ప్రజల్లోకి పోవడం లేదంటే అతని పాలనపై అతనికే నమ్మకం లేదు.
పోలవరం ప్రాజెక్టును నాశనం చేయడాన్ని నిరసిస్తూ పోలవరం పరిరక్షణ యాత్రను సీపీఐ పార్టీ తలపెట్టింది. పోలవరం సందర్శనకు వెళ్తున్న ఆ నేతలను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నేతల అరెస్ట్‌ను టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా ఖండించారు.
సందర్శనకు వెళ్లేవారిని ఎలా ఆపుతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. వెంటనే రామకృష్ణ, సీపీఐ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం వద్దకు వెళ్లి చూస్తే ప్రభుత్వానికి ఏం నష్టం? అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి బయటపడుతుందనే కారణంతోనే సీపీఐ నేతలను అడ్డుకుంటున్నారా అని తెలుగుదేశం నేతలు నిలదీశారు.
జగన్ కుట్రతో ఏపీ ప్రజలు ఇకపై తరతరాలుగా నష్టపోతూనే ఉంటారని వారు ఆవేదన వ్యక్తంచేశారు పోలవరం ఎత్తు తగ్గిస్తే రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్రాజెక్టు సందర్శిస్తే నేరం ఏమిటి? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అయ్యిందన్నారు.