ఏపీ సీఎం జగన్కు కౌంట్ డౌన్ స్టార్టయిందా? ఇప్పటి వరకు ఆయన దూకుడుకు ప్రభుత్వ పరంగా ఎవరూ అడ్డు చెప్పలేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అపహాస్యం పాలైనప్పటికీ.. ఎవరూ చింతించలేదు. జగన్ కు అన్నివిధాలా అందరూ సహకారం అందిస్తూ వచ్చారు. కేవలం కోర్టుల్లో కేసులు పడి.. న్యాయమూర్తులు ప్రశ్నిస్తే.. తప్ప.. జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఎవరూ మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దాదాపు ఏడాది కాలంగా రాజధాని రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నా.. స్పందించే నాథుడు లేకుండా పోయారు. ఇదంతా.. జగన్ తన మేధా శక్తే అనుకున్నారు. తనకు తిరుగు ఉండదని భావించారు.
మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే.. జగన్ తీసుకున్న ఏ నిర్ణయాన్నీ రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న ఏ ఒక్కరూ(కోర్టులు తప్ప) ప్రశ్నించలేదు. ప్రజలే వెళ్లి మొరపెట్టుకున్నా.. గవర్నర్ సైతం స్పందించలేదు. ఇక, కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. నువ్వు మాకు-మేం నీకు సహకరిస్తాం- అనే ధోరణిలోనే కేంద్రంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారు. దీంతో జగన్కు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు సొంత పార్టీలోనే వివాదాస్పద మయ్యాయి. కొందరు నాయకులు బాహాటంగా అనలేక పోయినా.. తెరవెనుక తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
అయితే.. ఇప్పుడు ఆకస్మికంగా ఏపీలో పరిణామాలు మారిపోయాయి. ఇప్పటి వరకు ఎవరైతే.. జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పని తెలిసి కూడా పక్కన పెట్టలేదో.. రాజధాని మహిళలు కూడా వెళ్లి బోరున విలపించినా.. పట్టించుకోలేదో.. ఆయనే జగన్ సర్కారుపై యూటర్న్ తీసుకుంటున్నారు. ఆయనే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇప్పటి వరకు అంటే.. దాదాపు ఏడాది ఐదు మాసాలు(గవర్నర్ నియామకం జరిగి)గా హరిచందన్.. జగన్ తీసుకున్న ఏ నిర్ణయాన్నీ అడ్డుకోలేదు. ఆఖరుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారంలో తనే ఇబ్బందుల్లో పడతానని తెలిసి కూడా గవర్నర్.. జగన్ తీసుకున్న నిర్ణయానికే జై కొట్టారు.
మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దు బిల్లుల విషయంలోనూ హరిచందన్ అలానే వ్యవహరించారు. దీంతో ఇక, గవర్నర్కు చెప్పుకొన్నా.. ఒక్కటే చెప్పకపోయినా ఒక్కటే అనే వాదన బలపడింది. కట్ చేస్తే.. ఇప్పుడు గవర్నర్ యూటర్న్ తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల(వీసీ)ను నియమించే విషయంలో ఆయన ప్రభుత్వం చేసిన సిఫార్సును తిప్పికొట్టారు. వాస్తవానికి ఇది చాలా చిన్న విషయం. పైగా హైకోర్టులో ఈ విషయంపై కేసు పడినా.. పనికానివ్వండి తర్వాత చూద్దాం! అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
అయితే.. గవర్నర్ మాత్రం తిప్పికొట్టారు. ఈ విషయంలో గవర్నర్ నుంచి వ్యతిరేకత వస్తోందని భావించిన సీఎం జగన్ స్వయంగా వెళ్లి.. ఈ విషయాన్ని గవర్నర్కు సర్దిచెప్పారు. కోర్టు కూడా సానుకూలంగా ఉందని.. మీరు సంతకం చేయండని కోరినట్టు తెలిసింది. అయినా.. చట్టవిరుద్ధంగా వీసీల నియామకం చేపడుతున్నారన్న భావనతో గవర్నర్ తిప్పికొట్టారు. దీంతో సదరు ఫైలును గవర్నమెంట్ వెనక్కి తీసుకోక తప్పలేదని అంటున్నారు. ఇక సీఎం-గవర్నర్ల విషయంలో మొత్తానికి ఇది ప్రారంభమేనని.. మున్ముందు ఇలానే వ్యవహరించే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.