నిప్పు రవ్వ కనిపించినంతనే ఇంటి మొత్తాన్ని నీళ్లతో తడిపేయటం ఒక ఎత్తు.. ఇంటికి సమీపంలో బడబాగ్ని విస్తరిస్తున్నా.. చేష్టలుడిగినట్లుగా వ్యవహరించటం. ఏడాది వ్యవధిలో కరోనా మహమ్మారి విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైనానికి ఇంతకు మించిన చక్కటి ఉదాహరణ మరొకటి ఉండదేమో? గత ఏడాది కరోనా నేపథ్యంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా.. రాత్రికి రాత్రి లాక్ డౌన్ విధించటంతో దేశ వ్యాప్తంగా ప్రజలు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. కోట్లాది మంది వలస కూలీలు వేలాది కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళుతు.. పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.
నిజానికి లాక్ డౌన్ విధించాలని భావిస్తే.. ఫలానా సమయం లోపు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకోవాలని వారం.. పది రోజులు గడువు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ.. సరైన వ్యూహం లేని నేపథ్యంలో సామాన్యులు.. బడుగు జీవులు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇదంతా గతమనుకుంటే.. వర్తమానంలోకి వస్తే.. లాక్ డౌన్ విధిస్తే కలిగే లాభం ఎంత? నష్టం ఎంతన్న విషయంపై క్లారిటీ వచ్చేసిన వేళ.. మరోసారి లాక్ డౌన్ విధించే విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు తొందరపడటం లేదు.
ఈ తీరుతో వణుకు పుట్టేలా పాజిటివ్ కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతూ విస్తరిస్తోంది. నెల క్రితం రోజుకు నలభై వేల కేసులు రోజువారీగా నమోదయ్యే దానికి బదులుగా.. తాజాగా రోజుకు లక్షన్నర కేసులు నమోదవుతున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది. రోజురోజుకి కేసుల నమోదు తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఇదే తీరులో ముందుకుసాగితే.. మరో నెల వ్యవధిలోనే.. రోజుకు పది లక్షల కేసులు నమోదు కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదే జరిగితే.. దేశ వ్యాప్తంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటమే కాదు.
కోట్లాది మంది వైరస్ బారిన పడతారు. అదే జరిగితే.. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోవటం.. వైద్య సేవలు ఖరీదుగా మారిపోయిన నేపథ్యంలో.. బడుగు జీవులు తీవ్రమైన ఇబ్బందులకు గురి కాక మానదు. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. రానున్న పరిణామాల్ని సరైన ధోరణిలో మదింపు చేసి లాక్ డౌన్ లేదంటే పాక్షిక లాక్ డౌన్ తో సహా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది.