ఇప్పటిదాకా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వారంతా ఓటమి అంచుల్లో ఉన్న నాయకుల జాబితాలో ఉన్నవారేనని తెలుస్తోంది. వైసీపీ హయాంలో వీరంతా అర్థ రహిత నిర్హేతుక వ్యాఖ్యలు చేయడమే కాదు విచక్షణ కోల్పోయి మాట్లాడి పరువు నడిరోడ్డున పొగొట్టుకున్నవారేనని వీరికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ అంటోంది. ఇక వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వారిలో అవంతి శ్రీను కానీ కొడాలి నాని కానీ వెల్లంపల్లి శ్రీను కానీ మొదటి వరుసలో ఉంటారు. కొడాలి నాని కాన్ఫిడెన్స్ ను కొట్టే లీడర్ ను కనుక టీడీపీ తయారు చేయగలిగితే తప్పకుండా ఇక్కడ పసుపు జెండాలు రెపరెపలాడడం ఖాయమని అంటోంది ఓ వర్గం.
ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ బాస్ నూ, ఆయన అబ్బాయినీ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. వీరితో పాటు వల్లభనేని వంశీ కూడా ఉంటారు. వీరి ఇద్దరి కాన్ఫిడెన్స్ ఏంటంటే తమను దాటి నాయకుడు ఒక్కరూ ఎదగడం సాధ్యం కాదని భావిస్తూ ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అదే నిజం అయితే ముందున్న కాలంలో వారిని దాటుకుని పని చేసేందుకు టీడీపీ మరింత కష్టపడాల్సి ఉంది. ఇప్పటిదాకా గుడివాడ కానీ గన్నవరం కానీ ఆ ఇద్దరి హవాలోనే ఉంది. మట్టి తవ్వకాల్లో వంశీ, పౌర సరఫరాల బియ్యం అక్రమ తరలింపులో నానీ కొన్ని ఆరోపణలు ఎదుర్కొని ఉన్న విషయం తెలిసిందేనని, వీటిపై విజిలెన్స్ దర్యాప్తు చేస్తే ఇద్దరూ దొరికిపోవడం ఖాయమని టీడీపీ అంటోంది.
ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారంపూడిని ఓడించేందుకు కాకినాడ కేంద్రంగా పవన్ ఒకవేళ పోటీచేస్తే అప్పుడు యుద్ధం మరింత రసవత్తరం కానుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని బహిరంగ సవాలును విసిరిన ద్వారంపూడిని ఓడించడం కూడా సులువు కాదు. అందుకే జనసేన ఆ సవాలును పూర్తి స్థాయిలో స్వీకరించలేదని విశ్లేషకులు అంటున్నారు. మరో వివాదాస్పద నేత గుడివాడ అమర్నాథ్ ను అనకాపల్లి కేంద్రంగా ఢీ కొట్టే శక్తి ఇప్పటి నుంచే అక్కడి టీడీపీ వర్గాలు పోగేసుకోవాలి. అయితే ఒకప్పుడు వీరి రాజకీయ మూలాలు తెలిసిన వారికి ఆయన్ను ఓడించడం పెద్ద కష్టమేం కాదని ప్రత్యర్థి వర్గం అంటోంది.