77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత సైనిక దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం.. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. ఆ తర్వాత జాతిని ఉద్దేశించి గంటా 40 నిమిషాల సేపు భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని, స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని, ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకుందామని అన్నారు. తన ప్రతి నిర్ణయంలో దేశానికే తొలి ప్రాధాన్యత అని, అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతుందని చెప్పారు.
కొన్ని వారాల కిందట మణిపూర్లో చోటు చేసుకున్న హింస ఈ దేశాన్ని ఎంతో బాధించిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ సమర్థవంతమైన రాష్ట్ర ప్రభుత్వం(బీజేపీ) ఉందని గుర్తు చేశారు. మణిపూర్ ప్రజలకు ఈ దేశంలో ఎంతో భాగస్వామ్యం ఉందన్నారు. మణిపూర్ అనేక సంస్కృతులు, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా కొనియాడారు. అనేక మంది ఇళ్లలో ఇప్పటికీ మణిపురి నృత్య రీతులు సాగుతుంటాయని అన్నారు. కానీ, కొందరు ఉద్దేశ పూర్వకంగానే ఇక్కడ అలజడులు సృష్టించారని.. వాటిని పెంచి పోషించాలని అనుకున్నాయని, కానీ,అక్కడి ప్రభుత్వం కూకటి వేళ్లతో వారిని తరిమికొట్టిందని ప్రధాని చెప్పారు.
ఇక, గత ప్రభుత్వాలు అన్నింటిలోనూ కమీషన్లు తీసుకున్నాయని.. అందుకే పథకాలు నిర్వీర్యం అయిపోయాయని ప్రధాని చెప్పారు. తాము వచ్చిన తర్వాత.. అన్ని పథకాలను నేరుగా సంబంధిత లబ్దిదారులకు అందించేలా బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని.. అందుకే ఎక్కడా అవినీతి, ఆశ్రిత పక్ష పాతం వంటివి లేకుండా ఆయా పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని ప్రధాని వివరించారు.
గత పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో కీలకమైన సంస్కరణలు తెచ్చిందని, టెక్నాలజీ, క్రీడలు, వ్యవసాయం, సైన్స్ అన్ని రంగాల్లో దేశం పురోగతిని సాధించిందని చెప్పారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సంక్షోభాన్ని సైతం దీటుగా ఎదుర్కొన్నామని, ఆ సమయంలో ఎన్నో దేశాలకు భారత్ ఆశాకిరణంగా కనిపించిందని చెప్పారు. ప్రపంచంలో మార్పులు తెచ్చేందుకు భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు. గడిచిన పదేళ్లలో భారత్ గొప్పతనాన్ని ప్రపంచమంతా గుర్తించిందని, 30 ఏళ్లలోపు యువత దేశానికి ఆశాకిరణం అని అన్నారు.
నారీశక్తి, యువశక్తి దేశానికి ఎంతో ముఖ్యమని అన్నారు. టెక్నాలజీలో దేశం దూసుకుపోతుందని, డిజిటల్ ఇండియా కల సాకారం చేసుకోబోతున్నామని చెప్పారు. దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు మోడీ. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నామని వెల్లడించారు. ఈ పథకం ప్రకారం ఒక కుటుంబానికి లక్షల రూపాయల మేర లాభం చేకూరుతుందని ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. స్వర్ణకారులు, కమ్మర్లు, రజకులు, క్షురకులు, తాపీ మేస్త్రీల కోసం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ పథకం కోసం దాదాపు 15 వేల కోట్ల రూపాయలను కేటాయించబోతున్నామన్నారు.