సందేశాలు ఇవ్వటం తప్పు కాదు. అలాంటివి ఇచ్చే ముందు తమ గురించి తాము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేం చేయాల్సినవన్నీ చేసేస్తాం.. ప్రజలకు నీతులు చెబుదామంటే ఇవాల్టి రోజున కుదరదంతే. ఎందుకంటే.. అందరికి అన్ని తెలుసు. ఒకవేళ తెలీకున్నా.. తెలియజెప్పేందుకు సోషల్ మీడియా.. గూగుల్ లాంటివెన్నో ఉన్నాయి. అలాంటివేళ.. ప్రముఖులు ఒళ్ల దగ్గర పెట్టుకొని సందేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయం తాజాగా కోహ్లీ దీపావళి సందేశం స్పష్టం చేస్తుందని చెప్పాలి.
దీపావళిని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ట్వీట్ చేశారు. పర్యావరణ హితంగా దీపావళి జరుపుకోవాలని.. టపాసులు కాల్చొద్దని కోరటం అతగాడి కొంప ముంచినట్లైంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వరుస ట్వీట్లతో ఉతికి ఆరేస్తున్నారు. నీతులు చెప్పే ముందు నువ్వు చేస్తున్నదేమిటి? అంటూ సూటిగా ప్రశ్నించి నిలదీశారు. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేలా పోస్టులు పెడుతున్నారు.
ఇంట్లో అరడజనుకార్లు.. ప్రైవేట్ జెట్ ఉన్న వ్యక్తి పర్యావరణం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. పలువురు అతడిబాటలో నడిచారు. కోహ్లి.. అనుష్క వాడుతున్న వాహనాల నుంచి వచ్చే కాలుష్యం లెక్కలు చెప్పుకొచ్చారు. కోహ్లీ.. అనుష్క వాడుతున్న వాహనాల నుంచి కాలుష్యం రావటం లేదా? అని ప్రశ్నించటంతో పాటు.. ‘‘ఒక జెట్ మూడు గంటల ట్రిప్ ద్వారా 6 టన్నుల కర్భన ఉద్గారాల్ని విడుదల చేస్తుంది. కార్ల ద్వారా కాలుష్యం కావటం లేదా?’’ అని మరో నెటిజన్ నిలదీశారు.
పర్యావరణం కోసం శ్రమిస్తున్న కొందరి ప్రముఖుల ఫోటోల్ని షేర్ చేస్తూ.. అందులో కోహ్లీ ఫోటోను చేరుస్తూ.. ఎవరు పర్యావరణాన్ని కాపాడుతున్నారు? అంటూ పోల్స్ నిర్వహించారు. సందట్లో సడేమియా అన్నట్లుగా ఈ వ్యవహారంలోకి కాంగ్రెస్ నేత ఒకరు ఎంట్రీ అయ్యారు. కోహ్లీ దీపావళి సందేశాన్ని తప్పుపడుతున్న వారికి తోడైన ఆయన.. మరింత ఘాటు వ్యాఖ్య చేశారు.
‘‘అనుష్క తన పెంపుడు కుక్క విరాట్ కోహ్లీ ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు.కుక్క కంటే విశ్వాసమైన జీవి మరొకటి లేదు. కాలుష్యం వల్ల మానవాళికి కలిగే ముప్పును కోహ్లీ ఇప్పటికే ఈ దోపిడీ దొంగలు.. మూర్ఖులకు చెప్పాడు.. ఓసారి మీ డీఎన్ఏను చెక్ చేయించుకోండి. మీరిక్కడి వారో కాదో తెలుస్తుంది’’ అంటూ ట్వీట్ తో విరుచుకుపడ్డారు. దీనిపై కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ట్వీట్ కు వివరణ అన్నట్లుగా మరో ట్వీట్ చేశారు.
అందులో.. ‘దీపావళి సందర్భంగా కోహ్లీ చేసిన సూచన ఆహ్వానించదగినది. కొంతమంది దుర్మార్గులు ట్విట్టర్ ను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరిస్తోంది. కోహ్లీపై విమర్శించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారుఅసలు మనుషులే కాదు. ఆ నీచులు కుక్క స్థాయిని తగ్గించారు. కానీ.. కుక్క కంటే విశ్వాసమైన జీవి ఈ భూమి మీద లేదు’ అని పేర్కొన్నారు. కోహ్లీ దీపావళి సందేశం.. ఇంతటి రచ్చకు కారణమైందని చెప్పక తప్పదు.