కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయం సాదించిన కాంగ్రెస్ మంచి జోష్ మీదుంది. ఈరోజు మధ్యాహ్నం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవానికి వీవీఐపీలను పేరుపేరున పిలిచింది. వీరిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎలాగూ ఉంటారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కాకుండా మరికొందరు ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖులను కూడా కార్యక్రమానికి పిలిచింది. దీంతో ప్రమాణస్వీకారోత్సవం బలప్రదర్శనగా మారబోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇక్కడ బలప్రదర్శన అంటే మిత్రపక్షాలో లేకపోతే యూపీఏ పక్షాల ముందు చేసేదికాదు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే ముందు బలప్రదర్శన అనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా యూపీఏ పక్షాల్లో కావచ్చు లేదా మరికొందరిముందు కాంగ్రెస్ పార్టీ చులకనైపోయిన మాట వాస్తవం. పార్లమెంటులో క్షీణించిపోతున్న బలం కారణంగా చాలామందికి కాంగ్రెస్ నాయకత్వం చులకనైపోయింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది.
హిమాచల్ అధికారంతో పార్టీ కాస్త ఊపిరిపీల్చుకుంది. అలాంటిది కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించటం అంటే మామూలు విషయంకాదు. కర్నాటకలో గెలుపు పార్టీకి బాగా బూస్టప్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకాలం కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పొడంటేనే గిట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు ఇపుడు కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి తమకు అభ్యంతరం లేదని చెప్పారంటే కర్నాటక మహత్యమనే చెప్పాలి.
ఇక ఇంతకాలం కాంగ్రెస్ ను చిన్నచూపు చూస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ కు సానుకూలంగా మారుతున్నారట. కాబట్టి బెంగాల్ సీఎం మమత, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యుటీ సీఎం తేజస్వి యాదవ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మహారాష్ట్ర నుండి ఉత్ధవ్ థాక్రే, శరద్ పవార్ లాంటి వాళ్ళని కార్యక్రమానికి ఆహ్వానించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే వీళ్ళలో స్టాలిన్, నితీష్ హాజరవుతారనే అనుకుంటున్నారు. అనుకున్నవాళ్ళంతా హాజరైతే యూపీఏ రూపంలో కాంగ్రెస్ మోడీకి సవాలు విసిరిందనే అనుకోవాలి. మరి చివరకు ఏమవుతుందో ఏమో.