అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం ఖాయమంటు సీనియర్ కాంగ్రెస్ నేత జై రామ్ రమేష్ ప్రకటించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధి పాదయాత్ర ఏపీలోకి ఎంటరవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కర్నాటకలో ఉన్న యాత్ర సుమారు 11వ తేదీన అనంతపురం జిల్లాగుండా ఏపీలోకి ప్రవేశిస్తుంది. ఈ నేపద్యంలోనే యాత్ర ముందస్తు ఏర్పాట్లను పరిశీలించేందుకు రమేష్ వచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధి ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వటంపైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పచ్చగా కళకళలాడుతున్న సమైక్యరాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఆస్తులు, ఆర్ధిక వనరులు, కల్పవృక్షంలాంటి రాజధాని హైదరాబాద్ తో కలిపి తెలంగాణాను ఏర్పాటుచేసింది కాంగ్రెస్సే. ఏపీ విషయానికి వచ్చేసరికి అప్పులు, లోటు బడ్జెట్, ఆర్ధిక వనరులు కూడా లేకుండా, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఏర్పాటుచేసింది.
విభజన సందర్భంగా ఏపీ కోసమని కొన్ని హామీలిచ్చింది కానీ వాటిని చట్టబద్దం చేయకుండా కేవలం పార్లమెంటులో ప్రకటనతో సరిపెట్టింది. దాంతో ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, పోలవరంకు నిధులు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు లాంటి వాటిని నరేంద్రమోడీ సర్కార్ తుంగలో తొక్కేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన నాశనంతో జనాలు పార్టీని వందడుగుల గొయ్యితీసి కపెట్టేశారు. అందుకనే రెండువరస ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కటంలేదు.
జనాల ఆగ్రహాన్ని అర్ధంచేసుకునే ఇపుడు రమేష్ ప్రత్యేకహోదాను బిస్కెట్ వేస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదెప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేదెప్పుడు ? హోదా సంగతి వదిలేసినా కాంగ్రెస్ ఇప్పటిలో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోవటంలేదు. కేంద్రంలో కాకపోయినా కనీసం ఏపీలో అయినా మళ్ళీ పుంజుకోవాలన్న ఉద్దేశ్యంతోనే జై రామ్ రమేష్ ప్రత్యేకహోదా హామీనిచ్చినట్లున్నారు. మరి రమేష్ వేసిన బిస్కెట్ ను జనాలు నమ్ముతారా?