చేతిలో పవర్ లేని చోట అధికారంలోకి వచ్చేందుకు నానా పాట్లు పడటం ఏపార్టీకైనా మామూలే. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే.. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అధికారంలో ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా కొట్టుకోవటం ఆ పార్టీకి మామూలే.
పవర్ లేని రాష్ట్రంలో దాని కోసం కిందామీదా పడే ఆ పార్టీ నేతలు.. అధికారం చేతిలో ఉన్న చోట.. ఏదోలా ఎన్నికల వేళకు ఏదో ఒక ఇష్యూను నెత్తిన చుట్టేసుకొని కిందామీదా పడటం వారికి అలవాటు అన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది.
ఇంత పెద్ద దేశంలో ఒకప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండేది. కాలంతో పాటు చోటు చేసుకున్న మార్పులతో తాజాగా.. గుప్పెడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో లేని పరిస్థితి. ఉన్న చోట అంతర్గత కుమ్ములాటలతో కిందా మీదా పడుతున్న దుస్థితి.
పంజాబ్ లో ఉన్న అధికారం.. సొంత నేతల మధ్య నడుస్తున్న అధిపత్య పోరుతో కిందామీదా పడటమేకాదు.. ఈ మధ్యనే ముఖ్యమంత్రిని మార్చటం తెలిసిందే. అయినప్పటికి అక్కడ లొల్లి ఇంకా కొలిక్కి రాలేదన్నది తెలిసిందే.
తాజాగా ఆ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ లోనూ సీఎం మార్పు కోసం లాబీయింగ్ మొదలైందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేశారు. వారికి మరో 10 మంది తోడు కావటంతో సీఎం మార్పుపై ప్రచారం ఊపందుకుంది.
తాజాగా ఢిల్లీకి చేరిన వారంతా సీఎం భూపేశ్కు అత్యంత సన్నిహితులుగా చెబుతున్నారు. దీంతో పంజాబ్ లో మాదిరి ఛత్తీస్ గఢ్ లోనూ ముఖ్యమంత్రిని మారుస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే.. పంజాబ్.. ఛత్తీస్ గఢ్ రాజకీయాలు వేరని.. ఒకదానితో మరొకదానికి పోలిక లేదని చెబుతున్నారు. రాష్ట్రంలోని 70 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూపేశ్ బాఘెల్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. భూపేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పదవిలో ఉంటారని స్పష్టం చేస్తున్నారు.
వ్యక్తిగత పనుల మీద తాము ఢిల్లీకి వచ్చామే కానీ.. మరింకేమీ లేదంటున్నారు. ఉత్తినే ఒకేసారి 30 మందికి వ్యక్తిగత పనులు రావటం రోటీన్ కు భిన్నమేగా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు.. మూడు రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలకు అవకాశం ఉంటుందన్నమాట వినిపిస్తోంది.