తెలంగాణా కాంగ్రెస్ ఒక విచిత్రమైన డిక్లరేషన్ నిబంధనను అమలు చేయబోతోంది. అదేమిటంటే పార్టీ టికెట్ రాకపోయినా పార్టీని విడిచిపెట్టనని ఆశావహులు హామీ పత్రాన్ని ఇవ్వాలి. ఆ విషయాన్ని డిక్లరేషన్ రూపంలో పార్టీకి అందచేయాలి. పార్టీలో ఉండటం, లేకపోతే పార్టీని వదిలేసి వెళ్ళిపోవటం అన్నది నేతల వ్యక్తిగత విషయం. దీన్ని డిక్లరేషన్లో ఎలాగ చేరుస్తారో అర్ధంకావంటలేదు. గట్టిగా చెప్పాలంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే టీడీపీలో నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు. టీడీపీలో ఉండలేక, బీజేపీలో చేరలేకే కదా రేవంత్ కాంగ్రెస్ లో జాయినయ్యింది.
మరదే పరిస్ధితి కాంగ్రెస్ నేతలకు ఎదురైనపుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ ను వదిలేసి ఇతర పార్టీల్లో చేరటంలో తప్పేముంది ? ఇప్పటి పార్టీకు లేదా నేతకు సిద్ధాంతాలు లేవుకదా. ఉన్నదంతా అధికారం కోసం రాద్దాంతమే. ఎంఎల్ఏ టికెట్ ఏ పార్టీలో దక్కుతుంది ? ఏ పార్టీ తరపున పోటీచేస్తే గెలుస్తాం ? ఏ పార్టీలో ఉంటే మంత్రి అవుతాము ? అన్నదే కదా ఇపుడున్న ఈక్వేషన్లన్నీ. ఎంఎల్ఏలుగా గెలిచిన వాళ్ళని ఇతరపార్టీలు తన్నుకుపోవటం ఏమిటి ? మంత్రిపదవులు కట్టబెట్టడం ఏమిటి ?
తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ తరపున గెలిచారు ? ఇపుడు మంత్రులుగా బీఆర్ఎస్ లో ఎలాగున్నారు. టీడీపీ, కాంగ్రెస్ తరపున గెలిచిన తర్వాతే కదా బీఆర్ఎస్ లోకి వెళ్ళింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను చీల్చి ఆ పార్టీల ఎంఎల్ఏలను బీఆర్ఎస్ లో కేసీయార్ కలిపేసుకున్నది ఏ సిద్ధాంతాల ప్రకారమో చెప్పగలరా ? కాబట్టి ఇపుడు కాంగ్రెస్ అడుగుతున్న డిక్లరేషన్ కూడా వర్కవుట్ కాదు. అవసరానికి ఇపుడు నేతలు డిక్లరేషన్ ఇస్తారు తర్వాత అవకాశం చూసుకుని ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారు. అప్పుడు కాంగ్రెస్ చేయగలిగేదేమీ ఉంటుంది ?
ఈ డిక్లరేషన్లు, ప్రమాణాలు అన్నీ కంటితుడుపు వ్యవహారాలే అని అందరికీ తెలుసు. ఆచరణలో ఇందులో ఒక్కటి కూడా పనిచేయదు. కాబట్టి కాంగ్రెస్ అనవసరమైన వ్యవహారాలతో జనాల్లో నవ్వులపాలవకుండా చూసుకోవాలి. గెలుపుపై కసరత్తు చేసుకుని అవకాశాలను మెరుగుపరుచుకుంటే అదే పదివేలు.