కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ 113 ను కాంగ్రెస్ అధిగమించింది. కాంగ్రెస్ పార్టీ 133 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, బీజేపీ 65 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇక, కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతానన్న కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్ 20 స్థానాల్లో ముందంజలో ఉంది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ఓటమిని కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై అంగీకరించారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదని, మెజారిటీ మార్క్ దక్కించుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ వర్కర్లు, నేతలు.. అందరూ శాయశక్తులా పార్టీని గెలిపించేందుకు కృషి చేశామని బొమ్మై చెప్పారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక పార్టీలో అంతర్మథనం చేసుకుంటామని, పొరపాట్లను దిద్దుకొని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ అన్నారు. స్థానిక సమస్యలపై కాంగ్రెస్ దృష్టి పెడితే మోదీ మాత్రం విభజనవాదాన్ని ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రజల జీవనోపాధి, ఆహార భద్రత, ధరల పెరుగుదల, రైతుల కష్టాలు, విద్యుత్ సరఫరా, నిరుద్యోగం, ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పోరాడిందని చెప్పారు. ప్రజల కష్టాలపై పోరాడిన కాంగ్రెస్ కు ఓటర్లు పట్టం కట్టారని చెప్పారు.
మరోవైపు, మైనింగ్ కింగ్ గాలి జనర్దన్ రెడ్డి తన సొంత పార్టీ కల్యాణ రాజ్య సమితి పక్ష తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు.15 మంది అభ్యర్థులను బరిలో నిలపగా.. ఆయన మాత్రమే గెలిచారు. గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి.. కేవలం 2,700 ఓట్ల మెజారిటీ సాధించారు. బళ్లారి సిటీ నుంచి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ బరిలో నిలిచి ఓడారు. గాలి జనార్దన్ రెడ్డి పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ కు భారీగా ఓట్లు పడ్డాయి. దీంతో, బీజేపీకి గాలి షాక్ కూడా తగలడంతో దాదాపు 14 స్థానాలు పోయాయని టాక్ వస్తోంది.