కాంగ్రెస్ పార్టీ…దేశంలోనే గ్రాంగ్ ఓల్డ్ ట్రంక్ పార్టీగా పేరుపొందిన అతి పెద్ద సెక్యులర్ పార్టీ. అయితే, కాంగ్రెస్ పార్టీలో చీమ చిటుక్కుమనాలన్నా సరే…ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ అంగీకారం ఉండాల్సిందే అన్నది ప్రతిపక్షాల విమర్శ. గతంలో అయితే, పీసీసీ చీఫ్ మొదలు సీఎం అభ్యర్థి వరకు ఎవరి పేరు డిసైడ్ కావాలన్నా ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో రావాల్సిందేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. ఆ విమర్శలకు తగ్గట్లుగానే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అదే తీరును కొనసాగిస్తూ విమర్శలపాలవుతూనే ఉంది.
తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ..సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎప్పటిలాగే మల్లగుల్లాలు పడుతూ ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ సానుభూతిపరుల విమర్శలను ఎదుర్కొంటోంది. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యతోపాటు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం కుస్తీపోటీ నడుస్తోంది. గతంలోని సీల్డ్ కవర్ ల సంస్కృతికి భిన్నంగా ఈ సారి ఇద్దరు సీఎం అభ్యర్థులను ఢిల్లీకే పిలిపించింది కాంగ్రెస్ అధిష్టానం.
మూడు రోజుల నుంచి మల్లగుల్లాలు పడుతున్నా ఇద్దరిలో ఎవరు సీఎం అన్న విషయంపై కాకలుదీరిన కాంగ్రెస్ నేతలకు సైతం క్లారిటీ లేదంటే ఆశ్చర్యం కలగ మానదు. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు, అంతర్గత కలహాలు, కీలక నాయకుల మధ్య విభేదాలు, సీఎం అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు వంటి విషయాలతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బిజీగా ఉంటోంది. ఈ లుకలుకలను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకొని ముందుకు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది.
పార్టీనే ముఖ్యం…అని కాంగ్రెస్ నేతల నుంచి కార్యకర్తల వరకూ అంతా కలిసికట్టుగా నడిస్తేనే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రొట్టె ముక్కలో వాటాల కోసం కాంగ్రెస్ నేతలు, లేదంటే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పోట్లాడుకుంటుంటే…ఎంచక్కా పక్కనే కాచుకు కూర్చున్న బీజేపీ రొట్టె ముక్క మొత్తాన్ని ఎగరేసుకుపోతోందంటూ విమర్శిస్తున్నారు. 2014, 2019 ఎన్నికలలో జరిగింది ఇదేనని, ఇకనైనా ఈ లోపాలు సరిదిద్దుకొని కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం పాటుబడాలని సూచిస్తున్నారు.