సెల్ ఫోన్ తో చిక్కులు అన్ని ఇన్ని కావు. హస్తభూషణంగా మారిన సెల్ ఫోన్ నోటిని కట్టేయాల్సి (సైలెంట్ మోడ్ లో) ఉన్నప్పటికీ కొందరు ఆ విషయాన్ని పట్టించుకోరు. ఈ కారణంగా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారికి మాత్రమే కాదు.. వారి చుట్టూ ఉన్న అందరికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి వేరే చోటు జరిగితే అసౌకర్యం మాత్రమే. కానీ.. కోర్టులో వాదనలు జరుగుతున్న వేళ జరిగితే? తాజాగా అలాంటి పరిస్థితే హనుమకొండ జిల్లా కోర్టులో చోటు చేసుకుంది. ఈ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇచ్చిన ఆదేశాలు కాంగ్రెస్ మహిళా నేతకు షాకిచ్చేలా మారాయి.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ న్యాయస్థానంలో ఊహించని షాక్ ఎదురైంది. కోర్టులో ఉన్న వేళలో ఆమె సెల్ ఫోన్ మోగిన వైనంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ఫైన్ షాకిచ్చింది. 2022 జులై ఒకటిన హనుమకొండలోని బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడిన ఉదంతంలో అనిల్ అనే కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతంపై సుబేదారి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంలో హనుమకొండ.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి.. ఎర్రబెల్లి స్వర్ణలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు మరో 13 మందిపైనా హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుకు సంబంధించిన వాదనలు హనుమకొండ జిల్లా మూడో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్నాయి. దీనికి నిందితులంతా హాజరయ్యారు. కేసుకు సంబంధించిన వాదనలుజరుగుతున్న వేళలో.. ఎర్రబెల్లి స్వర్ణ ఫోన్ మోగింది. దీంతో కోర్టు హాల్ లో సెల్ ఫోన్ మోగటంతో చోటు చేసుకున్న అంతరాయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు న్యాయమూర్తి. స్వర్ణ ఫోన్ ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.దీంతో.. ఆమె సెల్ ఫోన్ ను కోర్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.అనంతరం.. ఆమెకు రూ.100 ఫైన్ విధించారు. ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఆమె సెల్ ఫోన్ ఆమెకు అప్పజెప్పారు.అయినా.. కోర్టు హాల్లో విచారణకు హాజరయ్యే వేళలో.. కోర్టు బయటే ఫోన్ ఇచ్చేసి వస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా? లేదంటే.. ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటే అసలే తిప్పలు ఉండవు కదా?