‘‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’’ మాజీ రాజ్యసభ్య సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఓ పక్క వైసీపీ అధినేత, సీఎం జగన్ తో చిరు సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడంతో ఆయన వైసీపీ తరఫున రాజ్యసభకు నామినేట్ అవుతారని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు.
ఇక, ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా చిరు రావడం, ప్రధాని మోడీ చిరును ప్రత్యేక గౌరవం ఇవ్వడం చూసి అంతా ఆయన కాషాయం కప్పుకునేందుకు రెడీ అవుతున్నారని అనుకున్నారు. కానీ, చిరు మాత్రం రాజకీయాల గురించి చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయని చిరు ఇంకా టెక్నికల్ గా ఆ పార్టీలోనే ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
కానీ, చిరు మాత్రం తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని చాలా సార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే నిన్న చిరు అలా ఎందుకు ట్వీట్ చేశారా అన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. అది కేవలం గాడ్ ఫాదర్ చిత్రంలోని ఓ డైలాగ్ అని కొందరు అనుకుంటున్నారు. కానీ, 2024 ఎన్నికలలో ఏదో ఒక పార్టీ తరఫున చిరు ప్రచారం చేసే చాన్స్ ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి తమ పార్టీ వాడేనంటూ తాజాగా కాంగ్రెస్ షాక్ ఇచ్చింది.
చిరు రాజకీయాలపై ట్వీట్ చేసిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చిరుకు ఐడీని విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోవూరు నుంచి చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కాంగ్రెస్ పార్టీ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. త్వరలోనే జరగబోతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈ ఐడీ కార్డును పార్టీ జారీ చేసింది. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉన్న చిరు ఆ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లే ప్రసక్తే లేదని కొందరు అంటున్నారు. అయితే, చిరు ఇంకా పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీవాడేనని చెప్పుకునేందుకు ఈ పనిచేసిందని అంటున్నారు.