ఎన్నికల వేళ పార్టీలపై ఏ చిన్న మచ్చపడినా.. ఇబ్బందే. అందుకే.. పార్టీలు, నాయకులు కూడా.. చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విషయంలో వైసీపీ ఫర్వాలేదు. ఎందుకంటే.. రెబల్స్ లేరు. ఉన్నా.. వారిని ఉద్దేశ పూర్వకంగా.. వైసీపీ నేతలే రంగంలోకి దింపారనేది జగమెరిగిన సత్యం. ఇక, మిగిలిన నాయ కులు కూడా.. బాగానే పనిచేస్తున్నారు. ఎటొచ్చీ.. కూటమి పార్టీల్లోనే లుకలుకలు ఇంకా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి కూడా!
అయితే.. మరో వారంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీటిని ప్రజల్లోకి పోకుండా.. సాధ్యమైనంత వరకు చంద్రబాబు కవర్ చేస్తున్నారు.
ఇక పవన్ కూడా.. దీనిలో భాగంగానే.. ప్రచారాన్ని ఉదృతం చేయడం ద్వారా.. కూటమి లుకలుకలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. బీజేపీ నుంచి ఇలాంటి ప్రత్యా మ్నాయ వ్యవహారాలు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో కూటమిలో సహజంగానే ఇబ్బందులు వస్తు న్నాయి. ఇదిలావుంటే.. ఇప్పుడుఈ కుంపట్లను తగ్గించే ప్రయత్నం చేశారు.
ఉమ్మిడి మేనిఫెస్టో విషయానికి వచ్చేసరికి దీనికి బీజేపీ మద్దతు ఉందా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయాన్ని ఇప్పటి వరకు బీజేపీ తేల్చి చెప్పలేదు. పోనీ.. ఇతర మార్గాలు, మాధ్యమాల ద్వారా అయినా.. ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చుకోవాలి కదా! కానీ.. ఆ ప్రయత్నమే జరగడం లేదు.. దీంతో కూటమి.. బూటకం అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలను గుర్తించిన చంద్రబాబు.. తాజాగా జనసేనతో సంచలన ప్రకటన ఇప్పించారు.
ఉమ్మడి మేనిఫెస్టోపై జనసేన పార్టీ తాజాగా మీడియాలో ప్రకటన ఇచ్చింది. కీలక పథకాలపై ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణం సహా.. అనేక హామీలను ఈ సందర్భంగా గుప్పించింది. ఇది కీలకమైన సమయమని.. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటేయాలని.. పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఓకే.. ఇది బాగానే ఉంది. ఇక, ఇప్పుడు ఇదే తరహాలో బీజేపీ నుంచి కూడా.. ఎక్కడో ఒక చోట ఒక ప్రకటన ఇప్పించేస్తే.. ఇప్పటి వరకు ఉన్న అనేక అనుమానాలకు సమాధానం చెప్పినట్టు ఉంటుంది కదా ? అనే సూచనలు వస్తున్నాయి. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.