టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పాపులర్ అయిన అలీని గత కొన్నేళ్లుగా వైసీపీలో పదవి అందని ద్రాక్షగా ఊరిస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన అలీ 2019 ఎన్నికల సందర్భంగా జనసేనకు జై కొడతారని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక, 2019 ఎన్నికల సమయంలో గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ టికెట్ ఆశించి అలీ భంగపడ్డారు.
కొద్ది రోజుల క్రితం అలీని రాజ్యసభకు పంపేందుకు జగన్ రెడీ అయ్యారని జరిగిన ప్రచారం కూడా ప్రచారంగానే మిగిలింది. దీంతో, అలీకి ఏదో ఒక నామినేట్ పోస్ట్ అయినా దక్కుతుందని అంతా అనుకున్న ఇప్పటివరకు ఆ ఊసే లేదు. ఎమ్మెల్సీగా అలీ పెద్దల సభకు వెళ్తారని పుకార్లు వచ్చినా అవి నిజం కాలేదు. జగన్ సీఎం అయి మూడేళ్లయినా అలీకి మొండిచెయ్యి చూపించడంతో అలీ వైసీపీని వీడుతారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని అలీ తేల్చి చెప్పడంతో ఆ పుకార్లకు చెక్ పడినట్లయింది.
ఈ నేపథ్యంలోనే అలీకి ఎట్టకేలకు జగన్ ఓ పదవి కట్టబెట్టారు. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని జగన్ నియమించారు. అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారంనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఈ పదవిలో అలీ కొనసాగనున్నారు. సజ్జల టైప్ లో ఇతర ప్రభుత్వ సలహాదారుల తరహాలోనే అలీకి జీతభత్యాలు అందనున్నాయి.
అయితే, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ ఇలా అన్నీ వదిలేసి అలీకి సలహాదారుడి వంటి పోస్ట్ ఇవ్వడంపై ఆయన అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇటువంటి పోస్ట్ ఇవ్వడం ద్వారా అలీని జగన్ గౌరవించారా? అవమానించారా? అని మండిపడుతున్నారు.