పుర్రెకో బుద్ధి…జిహ్వకో రుచి…అన్నారు పెద్దలు. నిజంగానే బ్రెజిల్ లోని ఓ వ్యాపారి పుర్రెలో పుట్టిన ఓ ఆలోచన ఎంతో మంది జిహ్వలకు అరుదైన రుచిని అందిస్తోంది. తన వ్యాపారానికి ఆటంకంగా మారిన అతి పెద్ద సమస్యనే ఆయుధంగా మలుచుకున్న ఆ వ్యాపారి…ఇపుడు కోట్ల రూపాయాలు సంపాదించాడు. అవసరం అనేది మనిషిని కొత్త కొత్త మార్గాలు అన్వేషించేలా చేస్తుందన్నదానికి నిలువెత్తు ఉదాహరణ బ్రెజిల్ కు చెందిన బిజినెస్ మ్యాన్ హెన్రిక్ స్లోపర్ డి అరాజో.
తన కాఫీ ఎస్టేట్ ను నష్టాల్లోకి నెడుతోన్న జాకు పక్షినే ఉపయోగించుకున్న అరాజో….తన వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకువెళ్లిన వైనం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జాకు పక్షి రెట్టలతో అరాజో తయారు చేసిన కాఫీని జనాలు లొట్టలేసుకొని మరీ తాగుతున్న వైనం ఔరా అనిపించక మానదు.
ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు….2000 సంవత్సరంలో బ్రెజిల్ లోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిన్న కాఫీ ఎస్టేట్ యజమాని హెన్రిక్ స్లోపర్ డి అరాజోకు వచ్చిన ఓ చిన్న ఆలోచన అతడి జీవితంతోపాటు ఆ కాఫీ ఎస్టేట్ తలరాతనూ మార్చేసింది. తన కాఫీ ఎస్టేట్ లోని కాఫీ మొక్కలకు వచ్చే గింజలను జాకు పక్షులు నాశనం చేస్తుండడంతో అరాజోకు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు.
బ్రెజిల్లో సంరక్షిస్తున్న పక్షి జాతుల్లో జాకు పక్షి కూడా ఒకటి కావడంతో వాటి మీద ఈగ వాలినా సరే….అరాజో వ్యాపారం ఆరిపోతుంది. దీంతో, ఏం చేయాలో అర్థం కాక తలబాదుకుంటున్న అరాజోకు…ఇండోనేషియాలో పునుగు పిల్లి మలంతో తయారు చేసే కాఫీ గురించి తెలిసింది. అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ పొడి అని తెలిసిన అరాజో అవాక్కయ్యాడు.
దీంతో, జాకు పక్షి రెట్టలతో కూడా కాఫీ పొడి ఎందుకు తయారు చేయకూడదన్న ఆలోచన అతడికి తట్టింది. అనుకున్నదే తడవుగా ఇకపై కాపీ బీన్స్‌ను కాకుండా.. జాకు పక్షుల రెట్టలను సేకరించాలని తన కార్మికులకు చెప్పాడు. ఆ తర్వాత కాఫీ బీన్స్‌ను వేరు చేసి.. వాటిలోని పోషకాలు, రుచికి నష్టం లేకుండా శుభ్రంగా చేశాడు.
ఆ గింజలతో కాఫీ తయారు చేసి రుచి చూడగా షాకయ్యాడు. మామూలు కాఫీ కంటే జాక పక్షుల రెట్టలతో తయారైన కాఫీ చాలా రుచిగా ఉండడంతో ఎగిరి గంతేశాడు. పక్షులు ఆ కాఫీ గింజల్లోని పోషకాలను గ్రహించవని, వాటి కడుపులోని యాసిడ్ల వల్ల ఆ కాఫీ గింజలు రోస్ట్ అవుతాయని తెలుసుకున్నాడు. దీని వల్లే మామూలు గింజల కంటే ఈ రెట్టల్లో వచ్చిన గింజల రుచి ఎక్కువని గ్రహించాడు.
అంతే, జాకు పక్షుల రెట్టల కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీల సరసన నిలిచింది. ఒక కిలో పక్షి రెట్టల ధర వెయ్యి డాలర్లు (రూ.72,659) పలుకుతుంది. ఇపుడు, ఈ రెట్టల కాఫీని ప్రపంచంలోని చాలామంది లొట్టలేసుకొని మరీ తాగుతున్నారట. మరి, ఇంకెందుకు లేటు…అవకాశం ఉంటే మీరు కూడా ఈ రెట్టల కాఫీ ఓ కప్ సిప్ చేసేయండి.