ప్రస్తుతం భారత దేశాన్ని కరోనా చుట్టేస్తోందని, లెక్కలేనన్ని కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయని.. ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు గగ్గోలు పెడుతున్నారు.
గత ఏడాది కరోనా వెలుగు చూసిన దగ్గర నుంచి కోటీ 76 లక్షల కేసులు నమోదయ్యాయని.. అయితే.. ఈ సంఖ్య వాస్తవానికి 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సుమారు 5 కోట్ల మంది కరోనా బారిన పడి ఉంటారని లెక్కలు కడుతున్నారు.
కొవిడ్-19 రెండో దశ వ్యాప్తిపై శాస్త్రవేత్తలు, వైద్యులు చాలా కాలం నుంచి హెచ్చరిస్తున్నారని, అయినప్పటికీ.. మితి మీరిన నిర్లక్ష్యం కారణంగా కేసులు భారీగా పెరిగి పోయాయని తెలిపారు.
రెండో దశలో అన్నీ విఫలం
అదే సమయంలో కేసులు, మరణాలను దాస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి మౌలిక సదుపాయాల లేమి, మానవ తప్పిదాలు, తక్కువ సంఖ్యలో పరీక్షలు.. ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. తొలి దశలో టెస్టులు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం కరోనా రెండో దశ ప్రారంభమైన తర్వాత.. టెస్టుల సంఖ్య పెంచలేక పోవడంతో ఈ ఘటనలు సంభవిస్తున్నాయని వెల్లడించారు. “కేసులు, మరణాల సంఖ్య లెక్కించలేని విధంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే“ అని న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ అండ్ ఎనమిక్స్ పాలసీ డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ్ చెప్పారు.
పరిస్థితి చేయి దాటేసింది!
“గత ఏడాది 30 మందిలో ఒకరిలో కరోనా లక్షణాలను గమనించాం. టెస్టుల్లో ఇవి బయటపడ్డాయి. దీంతో కేసులను నమోదు చేయగలిగాం. ఎంతమేరకు ఇన్ఫెక్షన్ ఉందో ఖచ్చితంగా చెప్పాం. కానీ, ఇప్పుడు మాత్రం పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న మరణాలకు, అధికారిక లెక్కలకు పొంతన లేకుండా పోయింది“ అన్నారు.
నియంత్రించేశామనే ధీమా!
కాగా, దీనిపై అసలు విషయం కనుక్కునేందుకు `సీఎన్ ఎన్` కేంద్ర ఆరోగ్య శాఖను సంప్రదించాలని ప్రయత్నించింది. ఇదిలావుంటే, గత ఏడాది సెప్టెంబరులో తొలిదశ కరోనా సమయంలో ప్రభుత్వం బాగానే పని చేసింది. దీంతో మరణాల రేటులో చాలా వరకు తగ్గుదల నమోదైంది. దీంతో కరోనాను బాగానే నియంత్రించామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ క్రమంలోనే అప్పటి వరకు ఉన్న కొన్ని నియంత్రణలను సడలించాలని నిర్ణయించింది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనా కేసులు తక్కువగా నమోదు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో విశ్వాసం కలిగిందంటూ.. సంబరాలు చేసుకున్నారు. దేశం మొత్తం కరోనాను జయించిందని గత ఆగస్టులో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలోనూ పేర్కొన్నారు.
మే నెల మధ్య నాటికి రోజుకు 13 వేల మరణాలు!
అయితే, ఆ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న మరణ మృదంగం.. మే మధ్య నాటికి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అంచనా వేసింది. దీనిని బట్టి మే మధ్య నాటికి రోజుకు 13 వేల మంది మరణించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న మరణాల రేటుకు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
చాలీ చాలని పరీక్షలు
గత ఏడాదితో పోల్చుకుంటే.. కరోనా పరీక్షలు పెంచామని ప్రబుత్వం చెబుతున్నా.. వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. మాత్రం దీనికి చాలా దూరంగా ఉంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌లో రోజుకు 20 లక్షల పరీక్షలు చేస్తున్నామని చెబుతున్నా.. ప్రస్తుత పరిస్థితిలో ఇవి ఏమాత్రం చాలవని డబ్ల్యు హెచ్.వో.. చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సగటు పాజిటివిటీ రేటు 15% ఉంటే.. ఒక్క దేశ రాజధాని ఢిల్లీలో ఇది 30% లేదా అంతకు మించి ఉందని పేర్కొన్నారు. ఇక, కొందరిలో లక్షణాలు లేకపోవడంతో వారు అసలుటెస్టులకు కూడా రావడం లేదని దీంతో పరీక్షలు చాలా వరకు తగ్గినా.. వచ్చిన వారికి కూడా సరైన టెస్టులు చేసేందుకు మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు.
వీరితో మరింత ప్రమాదం!
భారత్‌లో విజృంభిస్తున్న కరోనా రెండో దశలో అత్యంత కీలకమైన పరిణామం.. అసలు లక్షణాలు లేవని భావిస్తున్నవారి వల్ల కూడా వ్యాప్తి పెరుగుతుండమేనని మిచిగన్ యూనివర్సిటీ బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ బ్రమర్ ముఖర్జీ తెలిపారు.
లక్షణాలు లేనివారిని ఆయన `సైలెంట్ ఇన్ ఫెక్షన్స్`గా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా టెస్టుల పరిస్థితి ఒక్కోచోట ఒక్కో విధంగా ఉందని, ముఖ్యంగా పేదలు సమయానికి వైద్య సేవలు పొందలేక పోతున్నారని తెలిపారు. అదే సమయంలో పనులు మానుకుని.. టెస్ట్ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రయత్నించలేకపోవడం వల్ల కూడా వీరిలో పాజిటివిటీ ఉంటే వేగంగా వ్యాపిస్తోందన్నారు.
నమోదు కాని మరణాలు
కరోనా విజృంభిస్తున్న సమయంలో దేశంలో కరోనా మరణాలు భారీ ఎత్తున సంభవిస్తున్నాయి. అయితే.. ఇవేవీ నిజానికి.. ఖచ్చితంగా నమోదు కావడం లేదని.. ప్రజారోగ్య స్పెషలిస్ట్ డాక్టర్ హేమంత్ షేవాదే తెలిపారు. సాధారణ రోజుల్లోనే 86 శాతం మరణాలు మాత్రమే నమోదవుతున్నాయని.. మిగిలిన 22శాతం అసలు వివిధ కారణాలతో నమోదయ్యే అవకాశం లేదన్నారు.
ఇక, ఇళ్లలోనే చనిపోవడం, హోం క్వారంటైన్లో తుదిశ్వాస విడవడం వంటి అనేక కారణాలతో ప్రస్తుతం మరణాల సంఖ్యపై సర్వత్రా అనేక సందేహాలు ఉన్నాయన్నారు. దీంతో కరోనా రెండో దశలో లెక్కలు సరిగా నమోదు కావడం లేదేన్నారు. నిజానికి ఇప్పుడు భారత్ అన్ని మరణాలు కరోనా మరణాలే అనడంలో సందేహం లేదని.. పేర్కొన్నారు. ఇళ్ల దగ్గర, అంబులెన్సుల్లో, రోడ్లపైనా.. ఆసుపత్రి గేట్ల ముందు కూడా అనేక మంది చనిపోతున్నా.. వీటికి ఏ డాక్టర్ కూడా ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదని.. దీంతో ఇవి మరణాల లెక్కల్లో చేరడం లేదన్నారు.
మరణాలు 9 లక్షల పైనే..?
మంగళవారం నాటికి దేశంలో 1,98,000 వేల మంది చనిపోయినట్టు ప్రబుత్వం ప్రకటించింది. అయితే.. ముఖర్జీ అంచనాల ప్రకారం.. మరణించిన వారి సంఖ్య 9,90,000 మంది చనిపోయిన ఉంటారు. ఇక, సామూహిక అంత్యక్రియలు, ఖననాలు వంటివి ఈ లెక్కకు బలాన్ని చేకూరుస్తున్నాయని ముఖర్జీ పేర్కొన్నారు. అనేక నగరాల్లో గడిచిన రెండు వారాలుగా సామూహిక మృతదేహ ఖననాలు జరుగుతున్నాయన్నారు. ఇంత మంది మృతి చెందడానికి కారణం.. వారిలో వైరస్ లక్షణాలగుర్తింపులో జరుగుతున్న జాప్యంగానే శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదో పెద్ద సవాల్!!
కరోనా మరణాలను లెక్కించకపోవడానికి మరో పెద్ద సవాల్ ఎదురవుతోందని ముఖర్జీ అభిప్రాయపడ్డారు. కరోనా మరణం గుర్తించేలోగానే బాధితుడు.. కిడ్నీ.. లేదా.. గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే వీటిని లెక్కించడం లేదన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బ్రిటన్ తదితర దేశాలు.. మరణాలకు కారణాలను, వాటి వెనుక ఉన్న రీజన్లను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. భారత దేశవ్యాప్తంగా రోజుకు వేలాది మంది మృతి చెందుతున్నారు. గత వారంలో ఒక్క ఢిల్లీలోనూ 3000 మందికి అంత్యక్రియలు నిర్వహించారు.. అని సౌత్ ఏషియా బ్యూరో.. చీఫ్ ఆఫ్ ఎకనమిస్ట్ మాక్స్ రాడెన్బెక్ తెలిపారు.
విధానపరమైన లోపాలే శాపం!
భారత్‌లో ఇంత పెద్ద ఎత్తున కరోనా సెకండ్ వేవ్ రావడానికి పాలనాపరైన విధాన లోపాలే కారణంగా ఉన్నాయని ముఖర్జీ తెలిపారు. “ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సరైన డేటా ఉంటే.. ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు, అదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఎక్కడా భారత్‌లో సరైన గణాంకాలు లేవు. అన్నీ తప్పుల తడకలే. దీంతో వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది“ అని ఆమె పేర్కొన్నారు.
విధానపరమైన మార్పులు వస్తేనే తప్ప.. మార్పులు సాధ్యం కావన్నారు. మార్చి మధ్య ప్రాంతంలో సెకండ్ వేవ్ ప్రారంభమైందని, ప్రధానంగా దేశరాజధానిని కుదిపేస్తోందని.. పేర్కొన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర మరింత ఆందోళనకర పరిస్థితికి చేరుకుందని తెలిపారు. దీంతో కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారని తెలిపారు.